ఇంజనీర్ల పితామహుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య

ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలు అనిర్వచనీయం. వందేళ్లు కాదు.. తరతరాలకు గుర్తుండిపోయేలా విశ్వేశ్వరయ్య తెలుగు నేలపై చూపిన ప్రతిభ ప్రపంచంలోని ఇంజనీర్లకు గొప్ప పాఠాలు. ఆయన భారతరత్నగా అందరికీ తెలుసు. ఇంజనీర్ల పితామహుడు అని కీర్తిస్తుంటారు. విశ్వేశ్వరయ్య గురించి భారతదేశమంతా తెలుసుకోవడం వేరు. ఆయన గురించి తెలుగు ప్రజలు తెలుసుకోవాల్సింది వేరు.


ఎందుకంటే తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలు అనిర్వచనీయం. వందేళ్లు కాదు. తరతరాలకు గుర్తుండిపోయేలా విశ్వేశ్వరయ్య తెలుగు నేలపై చూపిన ప్రతిభ ప్రపంచంలోని ఇంజనీర్లకు గొప్ప పాఠాలు. ప్రముఖ ఇంజనీరు, పండితుడు, రాజనీతిజ్ఞుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1861 సెప్టెంబర్ 16న అప్పటి మైసూర్ సామ్రాజ్యంలోని ఇప్పటి బెంగుళూరుకు దగ్గరలోని ముద్దెన హళ్ళి అనే గ్రామంలోని పేద కుటుంబంలో శ్రీనివాస శాస్త్రీ, వెంకటలక్ష్మమ్మ వుణ్య దంపతులకు జన్మించారు.

వీరి పూర్వీకులు ప్రకాశం జిల్లాలో ఉన్న మోక్షగుండం గ్రామం నుంచి మైసూరు రాష్ట్రనికి వలస వెళ్ళారు. విశ్వేశ్వరయ్య తండ్రి స్కూల్ టీచర్, విశ్వేశ్వరయ్యకి 5 సంవత్సరాల వయసప్పుడు వారి కుటుంబం చిక్ బల్లాపూర్‌కు మారటంతో విశ్వేశ్వరయ్య ప్రాథమిక విద్య అక్కడే చదివారు. కానీ 12 ఏళ్ల వయస్సులోనే తండ్రిని కోల్పోయాడు విశ్వేశ్వరయ్య, ఆ దు:ఖాన్ని దిగమింగుతూనే తల్లి చిన్నతనం నుంచి మంచి అలవాట్లను నేర్పి విశ్వేశ్వరయ్యను ఉన్నతంగా తీర్చిదిద్దింది. బెంగళూరులో హైస్కూల్ విద్య పూర్తి చేశారు. విశ్వేశ్వరయ్యకి చదువు పైన ఉన్న శ్రద్ధ, ఆసక్తిని గమనించిన ఉ పాధ్యాయులు నారదముని నాయుడు బెంగుళూరు సెంట్రల్ కాలేజీ ప్రిన్సిపాల్ వారిని ఎంతగానో ప్రోత్సహించి విశ్వేశ్వరయ్య ఎదుగుదలకు సహకరించారు.

పాఠశాల చదువు పూర్తయిన తరువాత మేనమామ రామయ్య సహకారంతో బెంగుళూరులోని సెంట్రల్ కాలేజీలో చదివారు. అక్కడ చదువులో మంచి ప్రతిభ కనబరచి కొన్నిసార్లు గణితంలో అధ్యాపకుల అనుమానాలను కూడా నివృత్తి చేసేవారు. ఖాళీ సమయాల్లో ట్యూషన్లు చెబుతూ కష్టాలతోనే మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. 1881లో డిగ్రీ పూర్తి చేశారు.

డిగ్రీ అంటే ఇప్పుడు కనీస అర్హతగా మారిపోయింది కానీ ఆరోజుల్లో డిగ్రీ చదవడమంటే అదో గొప్ప విజయం. ఆ తర్వాత పూణెలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో చేరారు. తరువాత మైసూరు మహారాజు వారి ఉపకార వేతనంతో పూనాలోని ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ డిప్లొమా పొందారు. బొంబాయ్ లోనే కొన్నాళ్లు పనిచేసి ఆ తర్వాత ఇండియన్ ఇరిగేషన్ కమిషన్లో చేరారు.

వారిప్రతిభను గుర్తించిన అప్పటి ప్రభుత్వం విశ్వేశ్వరయ్యని నేరుగా అసిస్టెంట్ సివిల్ ఇంజనీరుగా నియమించింది. తరువాత ఏడాదిలోగానే ఎగ్జిక్యుటివ్ ఇంజనీరుగా పదోన్నతి పొందారు. అప్పుడే భారతదేశానికి ఓ మేధావి గురించి తెలిసింది. సొంతంగా డిజైన్ చేసి 1903లో పూణె సమీపంలోని ఖదక్వస్తా రిజర్వాయరు ఆటోమెటిక్ వెయిర్ వాటర్ ఫ్లడ్ గేట్స్ ఏర్పాటు చేశారు. ఆయన సొంతంగా డిజైన్ చేసిన ఈ సిస్టమ్ కు పేటెంట్ కూడా దక్కింది. డ్యాము ఎలాంటి డ్యామేజీ లేకుండా వరద నీటిని స్టోర్ చేసుకునేందుకు వీలుపడింది.

అక్కడ ఆ ప్రయోగం విజయవంతం కావడంతో గ్వాలియర్ లోని టీగ్రా డ్యామ్, మైసూర్ లోని క్రిష్ణ రాజసాగర డ్యామ్ దగ్గరా అలాంటి గేట్లే ఏర్పాటు చేశారు. విశ్వేశ్వరయ్య ప్రతిభ, ఆయన చేస్తున్న సేవల్ని గుర్తించిన అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం 1906-07లో నీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థపై అధ్యయనం చేసేందుకు ఏడెను పంపించింది. మైసూరు సంస్థానానికి 1912 నుండి 1918 దివానుగా పనిచేశాడు.

హైదరాబాద్ వరదలకు విశ్వేశ్వరయ్య అడ్డుకట్ట :
హైదరాబాద్ చరిత్రలోనే అది అత్యంత భారీ వరదలవి. కనివినీ ఎరుగని రీతిలో మూసినది ఉప్పొంగటం జరిగింది. 50 వేల మంది హైదరాబాదీలను పొట్టనబెట్టుకుంది. 17 సెంటీ మీటర్ల వర్షం కురవడంతో మూసీ ఉగ్ర రూపం దాల్చింది. బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి హైదరాబాద్ రెండుగా చీలింది. అలా చీలిపోయిన హైదరాబాదు వురానాపూల్ బ్రిడ్జి మాత్రమే వారధిగా మిగిలింది. అప్పుడు హైదరాబాదు ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పరిపాలిస్తున్నారు.

హైదరాబాద్ మరోసారి ఇలాంటి భారీ వరదల్ని చూడొద్దని అనుకున్నారాయన. అందుకోసం విశ్వేశ్వరయ్య సేవల్ని వాడుకోవాలనుకున్నారు. వరద రక్షణ వ్యవస్థతో పాటు డ్రైనేజీ వ్యవస్థను రూపొందించేందుకు విశ్వేశ్వరయ్య హైదరాబాద్ కు చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన సలహా మేరకే గండిపేట, హిమాయత్ సాగర్ జంట జలాశయాలను నిర్మించారు. మూసీ నుంచి తరలివచ్చే వరదకు అక్కడే అడ్డుకట్టపడింది. అంతే కాదు. ఈ జలాశయాల్లో నిల్వ చేసిన నీళ్ల హైదరాబాదీల దాహార్తిని తీరుస్తున్నాయి. ఆనాడు విశ్వేశ్వరయ్య చూపిన ప్రతిభే మహా నగరానికి వరద ముప్పును శాశ్వతంగా దూరం చేసింది.

విశాఖపట్నానికి విశ్వేశ్వరయ్య సేవలు :
హైదరాబాదు వరదలు అతలాకుతలం చేసినట్టు ఆ సమయంలో విశాఖ పట్నాన్ని సముద్రం చీల్చేస్తోంది. సముద్రపు కోతను ఎలా అడ్డుకోవాలో ఎవరికీ అర్థం కాలేదు. అప్పుడే అందరికీ విశ్వేశ్వరయ్య గుర్తొచ్చారు. సముద్రవు కోత నుంచి తీరాన్ని రక్షించే వ్యవస్థను రూపొందించి విశాఖను కాపాడారు విశ్వేశ్వరయ్య, అంతేకాదు ఇప్పటి వరకు కోట్లాది మంది ప్రయాణించిన తిరుమల, తిరుపతి ఘాట్ రోడ్డు నిర్మాణానికి ప్లాన్ రూపొందించింది కూడా ఆయనే. కావేరీ నదిపై ఆసియాలోనే అతిపెద్ద డ్యామ్, బీహార్, మొకామా బ్రిడ్జి, ప్రభుత్వ సబ్బుల ఫ్యాక్టరీ,జోగ్ ఫాల్స్ దగ్గర హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్, బెంగళూరు-మైసూర్ రైల్ రోడ్డు మార్గం నిర్మాణాల వెనుక విశ్వేశ్వరయ్య ప్రతిభే కారణం. సౌత్ బెంగళూరులోని జయనగరు పూర్తిగా డిజైన్ చేసింది కూడా ఆయనే. ఆసియాలోని ఉత్తమ లేఅవుట్స్ అందించిన వ్యక్తిగా విశ్వేశ్వరయ్య పేరు తెచ్చుకున్నారు.

నిజాయతీకి నిలువుటద్దం విశ్వేశ్వరయ్య :
కొంతకాలం మైసూర్ దివాన్‌గా పని చేశారు. ఆయన సమయ పాలన, నీతి, నిజాయతీ, విలువల గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. దివాన్‌గా పనిచేసే సమయంలో విశ్వేశ్వరయ్య జేబులో రెండు పెన్నులుండేవి. అందులో ఒకటి కార్యాలయానికి సంబంధించిన పెన్ అయితే రెండోది తన వ్యక్తిగత పెన్. అంటే ఆఫీసు పెన్నును కూడా తన వ్యక్తిగత అవసరాలకు వాడు కోనంత నిజాయతీ ఆయనది. అంతేకాదు ఆయన కార్యాలయానికి వచ్చే టైమ్ చూసి అందరూ గడియారాలు సరిచేసుకునేవారట. ఆయన సమయపాలన అలా ఉండేది.

భారత రత్న :
భారతదేశానికి విశిష్ట సేవలందించిన ముగ్గురు గొప్ప ఇంజనీర్లుగా సర్ ఆర్థర్ కాటన్, కెఎల్ రావు, సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యలు చరిత్రలో నిలిచిపోయారు. విశ్వేశ్వరయ్య ప్రజలకు చేసిన సేవలకు గాను బ్రిటిష్ ప్రభుత్వం తరపున ఐదవ కింగ్ జారి నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండి యన్ ఎంపైర్ బిరుదునిచ్చి సత్కరించాడు. 1955 లో ఆయనకు భారతదేశపు అత్యున్నత పురస్కారమైన భారతరత్న లభించింది. ఇంజనీరుగా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మరియు విశిష్టమైన నిర్మాణాలను దేశానికందించిన విశ్వేశ్వరయ్య భారతదేశపు పునర్నిర్మాణం, భారత దేశంలో ప్రణాళికా బద్ధమైన ఆర్ధిక విధానం అనే గ్రంథాలను రచించారు.

8 విశ్వవిద్యాలయాలు వీరికి గౌరవ డాక్టరేట్లను ప్రధానం చేశాయి:
30 సంవత్సరాలు ఇంజినీరింగ్ రంగంలో విశిష్ట సేవలందించి గొప్ప నిజాయితీపరునిగా పేరు పొందారు. నిండు నూరేళ్లు జీవించిన విశ్వేశ్వరయ్య 1962 ఏప్రిల్ 14న ఆయన తుది శ్వాస విడిచారు. విశ్వేశ్వరయ్య పేరు మీద అనేక విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు. నేటి విద్యార్థులకు, ప్రతి ఒక్కరికీ వీరి జీవితం ఆదర్శప్రాయం. అతని సేవలకు గుర్తింపుగా వారి జయంతిని దేశమంతటా ఇంజనీర్స్ డే గా జరువుకుంటారు.

ఇంజనీరుగా విశేష కృషి :
ఇంజనీరుగా బొంబాయి పట్టణాభివృద్ధికి విశేష కృషి చేశారు 1903లో పూణే నగరానికి నీటిని సరఫరా చేసే పథకానికి రూపకల్పన చేసిన విశ్వేశ్వరయ్య ఖడక్ వాస్లా వద్ద అనకట్టకు ప్రమాదం లేకుండా నీటి ప్రవాహానికి తగినట్లుగా పనిచేసేలా మరియు అధికనీటిని నిల్వ చేసేలా అటోమేటిక్ వరదగేట్లు నిర్మించి అందరి దృష్టి నాకర్షించారు. ఇది ప్రపంచ ఇంజనీర్ల మన్ననలను పొందింది. బీజపూర్, ధార్వాడ, కొల్లాపూర్ మొదలయిన నగరాల మంచినీటి పథకాలకు రూపకల్పన చేశారు. మైసూర్ రాజు కోరిక మేరకు మైసూర్ సంస్థానంలో చీఫ్ ఇంజనీర్ మరియు దివాన్‌గా పని చేశారు. లక్షలాది ఎకరాల మెట్ట భూములకు నీరందించిన ప్రసిద్ధ కృష్ణరాజసాగర్ డ్యాం నిర్మాత విశ్వేశ్వరయ్య , 1917లో బెంగుళూరు ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ స్థాపనలో ముఖ్య పాత్ర పోషించారు.

మైసూర్ సంస్థానంలో దివాన్‌గా పనిచేసి మంచి ఆర్థికవేత్తగా పేరుపొందారు. ఆరేళ్ళలో అరవై ఏళ్ళ అభివృద్ధిని చేసి చూపించారు. భారీ పరిశ్రమలకు ప్రాధాన్యతనిస్తూ కుటీర పరిశ్రమలను ప్రోత్సహించాలనేది విశ్వేశ్వరయ్య అభిప్రాయం. వీరి హయాంలో అనేక పరిశ్రమలు స్థాపించారు. మైసూర్ మహారాజు కోరిక మేరకు నష్టాల్లో ఉన్న భద్రావతి ఇనుప కర్మాగారాన్ని రెండు సంవత్సరాల అవిరళ కృషితో లాభాల బాట పట్టించిన ఘనత విశ్వేశ్వరయ్యది.

హైదరాబాద్ నిజాం ఆహ్వానం మేరకు అక్కడ స్పెషల్ చీఫ్ ఇంజనీర్ గా పని చేసి హుస్సేన్ సాగర్ పథకానికి రూప కల్పన చేశారు. మూసీ నది వరద నుంచి ప్రజలను రక్షించటం కోసం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ తదితర పథకాలకు రూపుదిద్దారు. బీహార్‌లోని పాట్నా వద్ద గంగానదిపై రైల్వే వంతెనను నిర్మించారు. సుక్కూరు పట్టణానికి సింధూనది నీటిని సరఫరా చేసే ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేశారు. విదేశాల్లో కూడా అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేసి విదేశీ ఇంజనీర్ల మెప్పును పొందారు.