ట్రెండ్ అతను ఫాలో ఎవ్వడు, ట్రెండ్ సెట్ చేస్తాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

ఎవరైనా గెలిస్తే నిలబడతాడు. కానీ అతను నిలబడి గెలిచాడు. అతడు వచ్చినప్పుడు అందరిలో ఒకడు, కానీ ఇప్పుడు అందనంత ఎత్తులో అతడు. కొలవాలని చూస్తే ఎత్తు ఆరడుగులే, కానీ లెక్కించాలని చూస్తే మాత్రం వేరెవ్వరు చేయలేని సాహసం. వ్యక్తిగా వచ్చిన అతను ఇప్పుడు ఒక శక్తి అయ్యాడు. ఓటమి వెక్కిరించినా తలవంచని ధీరత్వం, వైఫల్యం ఎగతాళి చేసినా వెనక్కి తగ్గని తేజం, అసా''మాన్యుడి''గా ఎదిగిన సామాన్యుడు. అభిమానం అనే పదాన్ని భక్తి స్థాయికి తీసుకెళ్లిన కథా''నాయకుడు''. అతనే ''పవర్ స్టార్ పవన్ కళ్యాణ్''.

పవన్ కళ్యాణ్...ఈ పేరు ప్రజలకు కొత్తగా పరిచయం అక్కర్లేని పేరు. ఏ పనైనా చేయాలంటే కావాల్సిన ఆయుధం ''దైర్యం'', కానీ తెలుగు చలన చిత్ర చరిత్రలో అతని అడుగే ఒక ధైర్యం. అతని అడుగే ఒక సంచలనం. పవన్ కళ్యాణ్, సెప్టెంబర్ 2 1971 బాపట్లలో జన్మించాడు. పవన్ కు చిన్నపుడు నుంచి చదువు మీద ఆసక్తి ఉండేది కాదు. నెల్లూరులో ఇంటర్ అయిపోయాక అన్నయ చిరంజీవి తమ్ముడిగా ''అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'' సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. తక్కువ టైంలోనే తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. మెగా బ్రదర్ నుంచి ''పవర్ స్టార్'' గా ఎదిగాడు. అతనికి అభిమానులు ''సుస్వాగతం'' పలికారు. వచ్చిన కొద్దిరోజుల్లోనే మెగా అభిమానులకు నేనున్నానంటూ ''ధైర్యం'' ఇచ్చాడు.

ప్రేమ గురించి ''తొలిప్రేమ''గా చెప్పి, అభిమానులను తన సినిమాతో ''ఖుషి'' చేసి, ''తమ్ముడు''గా తన టాలెంట్ చూపించి, తన డైలాగ్ లు, డాన్స్ లతో ఫాన్స్ తో తీన్ మార్ ఆడించి, తనకంటూ ఒక క్రేజ్ క్రియేట్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. ట్రెండ్ అతను ఫాలో ఎవ్వడు, ట్రెండ్ సెట్ చేస్తాడు. 11 ఏళ్ళ వరకు ఒక్క హిట్ సినిమా లేదు. అయినా అభిమానులు పెరిగారే కానీ తగ్గలేదు. ప్రజలు ఒక్కసారి ఆదరిస్తే ఓడిన, గెలిచిన చివరి వరకు తనతోనే ఉంటారు అనేది అతని విషయంలో మరోసారి రుజువైంది. సినీ ఇండస్ట్రీ లో ఎందరో స్టార్ లు ఉండొచ్చు కానీ అభిమానుల్లో అయన స్థాయి వేరు, స్థానం వేరు. 11 ఏళ్ళ తరువాత వచ్చిన గబ్బర్ సింగ్ పవన్ కు బ్రేక్ ఇచ్చిన సినిమా. ''అత్తారింటికి దారేది'' సినిమాతో తన క్రేజ్ మరో సారి చూపించాడు. సినిమా ముందే 90 నిమిషాల సినిమా బయటికి వచ్చినా ఆ సినిమా కలెక్షన్స్ తో తన ''పంజా'' పవర్ ఏంటో చూపించాడు ''పవర్ స్టార్''.

పవన్ సినిమాల్లోనే కాదు అతని సినిమా డైలాగ్స్ లో, పాటల్లో కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆడవారి మాటలకు అర్థాలు వేరంటూ యువతకు హింట్ ఇస్తాడు, చలోరే చలోరే చల్ అంటూ యువతను ఆలోచించేలా చేస్తాడు, గెలవడం అంటే చంపడం కాదు ఓడించడం అని చెప్తాడు, నువ్వు హీరో కాదా, నీ కుటుంబానికి నువ్వే కదా హీరో అని గుర్తుచేస్తాడు, ఇలా మరెన్నో తన సినిమాలతో అభిమానులను భక్తులుగా మార్చుకున్న స్టార్, పవర్ స్టార్.

ఇంకా ప్రజలకు దగ్గరవడానికి, జనాల్లో మార్పు తేవడానికి 2014 మార్చి 14 న సొంతంగా ''జనసేన'' పార్టీ స్థాపించి జనానికి మరింత దగ్గరయ్యాడు పవన్. ఆ ఎన్నికల్లో నిలబడకపోయిన చంద్రబాబుకు, మోడీకి మద్దతిచ్చాడు. వాళ్ళ గెలుపులో తన వంతు పాత్ర పోషించాడు. ఆ తరువాత ఎన్నికల్లో నిలబడి జనసేన తరపున జనంతో ముందడుగు వేసాడు పవన్. ఎన్నికల్లో ఓడినప్పటికీ ప్రజల గెండెల్లో నిలిచిపోయాడు. పవర్ లేకున్నా ప్రజలకోసం పోరాడతానంటాడు, పదవి లేకున్నా ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటానంటాడు పవన్ కళ్యాణ్.