::..ఈపీఎఫ్ గురించి తప్పక తెలుసుకోవాల్సిన 10 విషయాలు..::
మీ బేసిక్ వేతనంలో 12% ఈపీఎఫ్ కోసం కట్ చేస్తారని మీకు తెలిసే ఉంటుంది. దానికి సమానమైన సొమ్మును యాజమాన్యం సైతం మీ పీఎఫ్ ఖాతాలో ప్రతి నెలా జమ చేస్తుంది. ఎక్కువ మంది ఉద్యోగులు ఇది మాత్రమే తెలుసుకుని ఉంటారు. అయితే పీఎఫ్ నిబంధనల్లో తెలియని కొన్ని విషయాలు ఉంటాయి. అలాంటి వాటి గురించి వివరణ మీ కోసమే... ఈపీఎఫ్ నామినీ నియామకం
1. ఉద్యోగ భవిష్య నిధి ఖాతాకు నామినీని నియమించుకోవచ్చు.
మీరు ఉద్యోగం చేరే సమయంలోనే ఈ పని చేయవచ్చు. అనుకోని పరిస్థితుల్లో ఉద్యోగి మరణిస్తే నామినీ సదరు వ్యక్తి పీఎఫ్ సొమ్మును క్లెయిం చేసుకోవచ్చు. పీఎఫ్ ఖాతాకు నామినీ లేకపోతే క్లెయిం సమయంలో చిక్కులు తప్పవు. నామినీని మార్చాలన్నా లేదా వివరాలను అప్‌డేట్ చేయాల్సి వచ్చినా ఫారం2ను వాడాలి. దీనికి సంబంధించిన వివరాల కోసం మీ కంపెనీ హెచ్ఆర్ లేదా ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ వారిని కలవండి.
2. పీఎఫ్ ఖాతా వల్ల భవిష్యత్తులో పింఛను..
ఉద్యోగులందరికీ సంపాదించే వయసు ముగిసిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రభుత్వం పింఛను ఏర్పాటు చేసింది. పీఎఫ్ ఖాతాలో రెండు విభాగాలు ఉంటాయి. ఒకటి ఈపీఎఫ్,రెండోది ఈపీఎస్ అనేది పింఛను కోసం ఉద్దేశించింది. మీరు చేసే 12% కంట్రిబ్యూషన్ మొత్తం ఈపీఎఫ్ కోసం వెళ్లగా, ఉద్యోగం కల్పించే సంస్థ చెల్లించే 12%లో కొంత పింఛను కోసం కేటాయిస్తారు. ఎవరైనా వ్యక్తి పింఛను పొందాలంటే 58 ఏళ్ల వయసు దాటి ఉండాలి. అయితే ఉద్యోగం లేని వ్యక్తులు కొన్ని సందర్భాల్లో 50 ఏళ్ల కంటే ముందే పింఛను పొందే వీలుంది. కనీస పింఛను రూ.1000 నుంచి ప్రారంభమవుతుంది.
3. ఈపీఎస్ సంబంధించిన సొమ్ముకు వడ్డీ రాదు..
మామూలుగా పీఎఫ్ ఖాతాలోని సొమ్ముకు చక్రవడ్డీ వస్తుంది. అయితే ఇది మొత్తం ఇలాగే ఉంటుందనుకోవద్దు. కేవలం ఈపీఎఫ్ వాటా సొమ్ముకు మాత్రమే చక్రవడ్డీ. ఈపీఎస్ వాటా సొమ్ముకు అంటే పింఛను కోసం యాజమాన్యం చెల్లించే దానికి చక్రవడ్డీ రాదు. పీఎఫ్ విత్‌డ్రాయల్ సమయంలో ఈపీఎఫ్, ఈపీఎస్ రెండింటినీ వెనక్కు తీసుకోవచ్చు.
4. 100% పీఎఫ్ సొమ్ము మీరు తీసుకోలేకపోవచ్చు..
మీ వాటా, యాజమాన్య వాటా కలిపి దాదాపు రూ. 3,50,000 అయింది అనుకుందాం. ఇందులో రూ.2,50,000 వరకూ ఈపీఎఫ్, మిగిలిన రూ.1 లక్ష ఈపీఎస్(పింఛన సొమ్ము). ఇప్పుడు మీరు 6వ ఏట ఉద్యోగం మానేసి విత్‌డ్రాయల్‌కు ప్రయత్నించారు. అప్పుడు మీరు రూ. 3,50,000 తీసుకుని వాడుకోవచ్చు అని అనుకుంటారు. అది తప్పు. కేవలం ఈపీఎఫ్ 100% వాటాను మాత్రమే మీరు ఒకేసారి వెనక్కు తీసుకోవచ్చు. అయితే పింఛను వాటా డబ్బుకు సంబంధించి మీరు సర్వీసు పూర్తి చేసుకున్న సంవత్సరాల ఆధారంగా విత్‌డ్రా చేయగల సొమ్ము పరిమితి మారుతుంది. ఇది టేబుల్ డీలో ఉంటుంది.
5. పీఎఫ్‌లో ఎక్కువ సొమ్మును సైతం పెట్టుబడి పెట్టొచ్చు..
వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్‌లో భాగంగా మీరు బేసిక్‌లో 12% కన్నా ఎక్కువ డబ్బును పీఎఫ్ ఖాతా ద్వారా పొదుపు చేసుకోవచ్చు. దీన్ని వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్(వీపీఎఫ్) అని వ్యవహరిస్తారు. ఇలాంటి సందర్భంలో అధికంగా వెచ్చిస్తున్న సొమ్ము సైతం పీఎఫ్‌లో పెట్టుబడిగా ఉంటూ దానిపై వడ్డీని పొందుతారు. అయితే యాజమాన్యం మాత్రం కేవలం మీ బేసిక్‌లో 12% వాటాకు సమానమైన సొమ్మును మాత్రమే పీఎఫ్ ఖాతాకు జమ చేస్తుంది.
6. ఉద్యోగం మారినప్పుడు ఈపీఎఫ్ క్లెయిం చేయడం..
న్యాయసమ్మతం కాదు చాలా మంది ఉద్యోగం మారినప్పుడల్లా చాలా సులువుగా పీఎఫ్ విత్‌డ్రాయల్స్‌కు ప్రయత్నిస్తారు. అయితే ఉద్యోగం మానేసి రెండు నెలలు ఎటువంటి ఉపాధి లేని సందర్బాల్లో మాత్రమే పీఎఫ్ విత్‌డ్రాయల్స్ చేయాలి. ఈపీఎఫ్ నిబంధనల ప్రకారం ఉద్యోగం మారిన సందర్భాల్లో ఈపీఎఫ్ సొమ్ము తీసుకోవడం చట్టప్రకారం అనుమతి లేని విషయం. మీరు కొత్త ఉద్యోగం తెచ్చుకుని కంపెనీ మారుతుంటే పీఎఫ్ బదిలీకి మాత్రం అవకాశముంటుంది.
7. ఈపీఎఫ్ వద్దనుకునే అవకాశముంది..
చాలా మందికి ఈ విషయం ఆశ్చర్యకరంగా ఉంటుంది. మీ బేసిక్ శాలరీ రూ. 21 వేల కంటే ఎక్కువ ఉంటే పీఎఫ్ అనేది స్వచ్చందం. మీరు కావాలనుకుంటే పీఎఫ్ వద్దని చెప్పవచ్చు. ఇదివరకే మీరు పీఎఫ్ పరిధిలో ఉండి, మీ బేసిక్ 21 వేలకు పైగా పెరిగిన సందర్భాల్లో పీఎఫ్ ఖాతా నుంచి నిష్క్రమించేందుకు లేదు. పీఎఫ్ వద్దని భావించే వారు ఫారం 11ను పూర్తి చేయాలి.
8. పీఎఫ్ ఖాతా ద్వారా ఒక బీమా మీకు ఉచితంగా ఉన్నట్లే..
సంస్థ గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ సమకూర్చని చోట ఈపీఎఫ్ ద్వారా కనీస మొత్తంతో కూడిన ఒక జీవిత బీమా ఉంటుంది. ఎందుకంటే ఈడీఎల్ఐ(ఎంప్లాయి డిపాజిట్ లింక్‌డ్ ఇన్సూరెన్స్) కోసం యాజమాన్యం బేసిక్‌లో 0.5% వాటాను చెల్లిస్తుంది. అయితే ఇదివరకే బీమా ప్రయోజనాలను తమ ఉద్యోగులకు కల్పిస్తున్న సంస్థలకు దీన్నుంచి మినహాయింపు ఉంది.
ఈడీఎల్ఐ 1976 కింద గరిష్టంగా రూ. 6 లక్షల వరకూ ఈ రకమైన బీమా పొందొచ్చు.
9. పీఎఫ్ విత్‌డ్రా కారణాలు..
మీరు కష్టపడి పొదుపు చేసిన డబ్బును అత్యవసరాల్లో వెనక్కు తీసుకునే వీలు ఉంటుంది. పీఎఫ్ సొమ్మును మీ, మీ పిల్లల వివాహ అవసరాలు; వైద్య ఖర్చులు ; ఇంటి రుణం తీర్చడం కోసం వెనక్కు తీసుకునే వెసులుబాటు ఉంది. మీ కంట్రిబ్యూషన్‌లో 50% వరకూ సొమ్మును వివాహ అవసరాల నిమిత్తం తీసుకోవచ్చు. వైద్య ఖర్చుల కోసం మీ వేతనానికి 6 రెట్ల సొమ్మును తీసుకోవచ్చు. ఇంటి రుణాన్ని తీర్చేందుకు సొమ్మును వెనక్కు తీసుకోవాలంటే మీరు ఉద్యోగం చేస్తుండబట్టి పదేళ్లు పూర్తి కావాలి. మీ వేతనానికి 36 రెట్ల డబ్బును మీ కంట్రిబ్యూషన్ నుంచి విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది.
10. ఈపీఎఫ్‌కు సంబంధించిన సమస్యలు ఉంటే..
ఈపీఎఫ్ సంబంధించి పెట్టుబడి పెట్టేటప్పుడు బాగానే ఉంటుంది. అయితే విత్‌డ్రాయల్స్ చేసేటప్పుడు చాలా మందికి పలు సమస్యలు తలెత్తుతుంటాయి. విత్‌డ్రా దరఖాస్తు చేసి ఎన్ని రోజులైనా ఏమైందో తెలీదు. డబ్బు రాదు. అలాగని ఎటువంటి సమాచారం ఉండదు. అలాంటి సమయంలో ఆర్‌టీఐ మీకు పనికొస్తుంది. ఈపీఎఫ్ కార్యాలయానికి నిర్దిష్ట సమాచారంతో మీకు కావాల్సిన దాని గురించి సమాచార హక్కు(ఆర్‌టీఐ) దరఖాస్తును సమర్పించవచ్చు. ఈపీఎఫ్ ట్రాన్స్‌ఫర్ లేదా ఉపసంహరణ సమయంలో దీన్ని ఉపయోగించవచ్చు.
0 Comments
కామెంట్‌ను పోస్ట్ చేయండి