1965 భారత్ - పాకిస్తాన్ యుద్ధం | India - Pakistani War of 1965

 మొదటి యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయినప్పటికీ, ఐక్యరాజ్యసమితి తీర్మానం ద్వారా కశ్మీర్ లో మూడింట రెండు వంతుల భూమి దాని ఆధీనంలోకి వెళ్లింది. అయినా పాక్ ప్రభుత్వం సంతృప్తి పడలేదు. లాల్ బహదూర్ శాస్త్రి ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో, 1965 ఆగస్టు 5న పాక్ బలగాలు వాస్తవాధీన రేఖను దాటి భారత్ లోకి ప్రవేశించాయి. దాదాపు ౩౩ వేల మంది పాక్ సైనికులు మన భూభాగంలోకి చొరబడ్డారని కశ్మీరీ ప్రజల ద్వారా తెలుసుకున్న భారత ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దింపింది. అలా, పాక్ తో రెండో యుద్ధం మొదలైంది.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పెద్ద సంఖ్యలో యుద్ధ ట్యాంకులను ఉపయోగించిన సందర్భం ఇదే. మొత్తం మీద లక్షమంది భారతీయ సైనికులు, 60 లక్షల మంది పాక్ సైనికులు యుద్ధంలో పాల్గొన్నారు. వైమానిక, ట్యాంకు, నావికాదళం భారీ స్థాయిలో యుద్ధంలో పాల్గొన్నాయి. భారత్ 700 యుద్ధ విమానాలను రంగంలోకి దింపింది. పాక్ 280 యుద్ధ విమానాలను పంపింది.

ఈ యుద్ధ సమయంలోనే ఆనాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్, జై కిసాన్ నినాదాన్ని ఇచ్చారు. సైనికుల కోసం భారీగా ఆహార పదార్థాలను పంపాల్సి రావడంతో దేశ ప్రజలందరూ వారానికి ఒకరోజు ఒంటిపూట భోజనం చేయాలని పిలుపునిచ్చారు. రోజురోజుకూ యుద్ధం భీకరంగా మారడంతో అప్పటికే కశ్మీర్లో ఉన్న లక్షమందికి అదనంగా భారత్ రిజర్వు సైనిక బలగాలను పూర్తి స్థాయిలో యుద్ధానికి పంపింది. ఢిల్లీలోని సాయుధ పోలీసు బలగాలను కూడా కశ్మీర్ లోని కీలక ప్రాంతాల్లో మోహరించారు. అప్పుడు కొన్ని రోజుల పాటు ఢిల్లీ నగరంలో ట్రాఫిక్ నియంత్రణ బాధ్యతలను ఆర్ఎస్ఎస్ కు అప్పగించారు. భారతీయ సైన్యం దూకుడుగా దూసుకుపోయింది. పాక్ సైనికులను హతమారుస్తూ పాక్ లోకి ప్రవేశించింది. లాహోర్, సియాల్ కోట్ వరకూ పూర్తిగా పాక్ భూభాగాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది.

యుద్ధం భీకరంగా మారడంతో అమెరికా, సోవియట్ యూనియన్ లు ఆపడానికి ప్రయత్నించాయి. సోవియట్ లోని తాష్కెంట్ నగరంలో ఇరు దేశాధినేతలతో సంధి చర్చలు మొదలయ్యాయి. యుద్ధం ముగిసే సమయానికి తమ బలగాలు ఎక్కడున్నాయో అక్కడి వరకూ భారత్ ఆధీనంలోనే ఉండాలని భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి పట్టుబట్టారు. ఈ చర్చలు జరిగే సమయానికి పాక్ లోని 1920 చదరపు కిలోమీటర్ల భూభాగం భారతీయ సైన్యం ఆధీనంలో ఉంది. భారత్ లో పాక్ 540 కిలోమీటర్ల మేర ఆక్రమించింది. కానీ పాక్ భారీగా నష్టపోవడంతో త్వరగా కాల్పుల విరమణకు సిద్ధపడింది. ఆ యుద్ధంలో భారత్ 2862 మందిసైనికులను కోల్పోయింది. 5800 మంది సైనికులు హతమయ్యారు.

యుద్ధం ముగిసే సమయానికి ఎవరి ఆధీనంలో ఉన్న భూభాగం వారిదే అనే శాస్త్రి మాటకు అమెరికా, సోవియట్ అధ్యక్షులు ఆశ్చర్యపోయారు. యుద్ధం మొదలు కాకముందు ఉన్న వాస్తవాధీన రేఖ ప్రకారం బలగాలు వెనక్కి వెళ్లాలని వారు ఒత్తిడి చేశారు. శాస్త్రి మొండిగా వాదిస్తే ఐక్యరాజ్య సమితిలో అది భారత్ కు వ్యతిరేకంగా మారవచ్చని బెదిరించి ఒప్పించారు. తప్పనిసరి పరిస్థితిలో శాస్త్రి కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకం చేశారు. 1966 ఫిబ్రవరి 25 లోగా బలగాల ఉపసంహణకు అంగీకరించారు. ఆ మర్నాడు అక్కడే అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయన గుండెపోటుతో మరణించారని సోవియట్ యూనియన్ ప్రకటించినా, విష ప్రయోగం జరిగి ఉంటుందని భారతీయులు అనుమానించారు.

మొత్తానికి నెల రోజులకు పైగా జరిగిన రెండో యుద్ధంలో భారత బలగాలు పాక్ లో సగానికి పైగా భూభాగాన్ని ఆక్రమించినా, అమెరికా, సోవియట్ ఒత్తిడి కారణంగా సైన్యాన్ని వెనక్కి రప్పించాల్సి వచ్చింది. భారత్ యుద్ధాన్ని గెలిచినా, ఆక్రమించిన భూభాగాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఓటమి అంచున ఉన్న పాకిస్తాన్ కు అమెరికా, సోవియట్ ల వైఖరి కలిసి వచ్చింది. తాష్కెంట్ లో అమెరికా, సోవియట్ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించి, చివరకు కాల్పుల విరమణకు అంగీకరించిన ఆనాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిని అనుమానాస్పద స్థితిలో మన దేశం కోల్పోయింది.