ప్రపంచ కుబేరుడు ఇంట్లో గిన్నెలు కడుగుతాడు? నమ్మకపోతే చదవండి... Bill Gates Autobiography in Telugu

మీతో ప్రతి నిత్యం ఉన్నవాళ్లు సంతోషంగా ఉన్నారా, వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా అనేదే మీ విజయానికి కొలమానం.
ఈ భూమండలం మీదే అత్యంత సంపన్నుడు, మైక్రోసాఫ్ట్ సామ్రాజ్యాధినేత బిల్ గేట్స్ రోజు ఎలా గడుపుతారు? ముందు ముగింపు నుంచి మొదలెడదాం. 

ప్రతి రాత్రి భోజనం చేసి, పడుకోబోయే ముందు బిల్ గేట్స్ తమ ఇంట్లో గిన్నెలు కడిగి, వాటిని శుభ్రం చేస్తుంటారు. “ఇంట్లో నన్ను వద్దని వారిస్తుంటారు గానీ ఈ పని చెయ్యటం నాకిష్టం” అంటారు గేట్స్ మైక్రోసాఫ్ట్ బాధ్యతలను తగ్గించుకుని.. మానవాళి అభ్యున్నతి కోసం దాతృత్వ కార్యక్రమాలను చేపట్టి భార్య మిలిండాతో కలిసి ప్రపంచమంతా తిరుగుతున్న గేట్స్. ఇప్పటికీ ఇంటి వద్ద ఉంటే మాత్రం తన దినచర్యను కచ్చితంగా పాటిస్తారు. 

పుస్తక పఠనం ఒక్కటే మనల్ని చురుగ్గా ఉంచుతుందని నమ్మే గేట్స్.. ఏడాదికి 50 పుస్తకాలైనా చదువుతారు. వాటి గురించి 'గేట్స్ నోట్స్' పేరుతో బ్లాగులో రాస్తారు. "సమస్యేమంటే పుస్తకాలు చదువుతూ రాత్రి పొద్దుపోయే వరకూ మేల్కొని ఉన్న రోజున.. మర్నాడు ఇబ్బందిపడతా. నాకు రోజూ 7 గంటల నిద్ర అవసరం. అప్పుడే పనులన్నీ సక్రమంగా చెయ్యగలుగుతా” అని చెబుతారు గేట్స్. లేస్తూనే రోజూ ట్రెడ్ మిల్ మీద ఒక గంట వ్యాయామం చేస్తూ రకరకాల వైజ్ఞానిక వీడియోలు చూస్తుంటారు. 

ఇష్టమైతే ఇంటి పక్క కోర్టులో టెన్నిస్ ఆడతారు. తర్వాత పత్రికలు తిరగేస్తారు. “ఉదయాన్నే చదవటానికి ఆసక్తికరమైనది ఎదురుగా ఉండటం గొప్ప విషయం” అంటారాయన. వేగంగా పని మొదలెట్టాలని చూస్తూ.. చాలాసార్లు బ్రేక్ ఫాస్ట్ మానేస్తుంటారు. పని గంటలను ఐదైదు నిమిషాలుగా విభజించుకుని, ప్రతి నిమిషానికీ ప్రణాళిక వేసుకోవటం గేట్స్ అలవాటు. 

మధ్యాహ్న భోజనంలో ఇష్టమైన చీజ్ బర్గర్ ఉంటే చాలు. పని, చదువు.. ఈ రెండూ లేనప్పుడు తమ ముగ్గురు పిల్లలతో గడుపుతారు. కొడుకును తీసుకుని క్షిపణి కేంద్రాల వంటి ప్రదేశాలకు వెళుతుంటారు. ప్రతి ఏడాది మొదట్లో కొన్ని లక్ష్యాలు పెట్టుకుంటారు. ఈ ఏడాది విద్యారంగంలో టెక్నాలజీని వాడటం ఎలా? అన్న సవాల్ మీద పని చేస్తున్నారు.