Capture

ఓట్స్ ఇడ్లీ తినేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే… ఇది ఎంతో రుచికరంగా ఉంటోంది. దీన్లో ఎన్నో పోషకాలుంటున్నాయి. ఆరోగ్యానికి ఎంతో మేలైన ఆహారంగా దీన్ని భావిస్తున్నారు. పైగా చిన్న పిల్లల నుంచీ ముసలివాళ్ల వరకూ అందరూ ఓట్స్ ఇడ్లీ తినవచ్చు. తేలిగ్గా జీర్ణమవుతుంది. జ్వరం వచ్చిన వారు కూడా ఓట్స్ ఇడ్లీ తినవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ఓట్స్ ఆరోగ్యానికి ఎంతో మంచివి కాబట్టి… ఇలాంటి ఇడ్లీలను తరచూ తినడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది.

ఓట్స్ ఇడ్లీ తయారీకి కావాల్సినవి :

  • ఓట్స్ – 2 కప్పులు
  • పుల్లటి పెరుగు – 2 కప్పులు
  • నూనె – అర టీ స్పూన్,
  • ఆవాలు – టీ స్పూన్
  • మినప్పప్పు – టేబుల్ స్పూన్
  • శెనగపప్పు – అర టేబుల్ స్పూన్
  • పసుపు – చిటికెడు
  • ఉప్పు – తగినంత
  • ఈనో ఫ్రూట్‌ సాల్ట్‌ – చిటికెడు
  • పచ్చిమిర్చి – రెండు (సన్నగా తరగాలి)
  • క్యారెట్‌ తురుము -2 టేబుల్‌ స్పూన్లు,
  • కొత్తిమీర తురుము – టేబుల్‌ స్పూన్

ఓట్స్ ఇడ్లీ తయారీ విధానం :

– ముందుగా ప్యాన్ (బాణలి)లో ఓట్స్‌ వేసి కాస్త రంగు మారేవరకూ వేయించాలి. తర్వాత అవి వేడి తగ్గాక… మిక్సీలో వేసి పొడి చెయ్యాలి.

– చిన్న కడాయిలో నూనె వేసి… నూనె వెడెక్కాక… ఆవాలు, మినప్పప్పు, సెనగపప్పు వేసి వేయించాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర తురుము, క్యారెట్‌ తురుము, పసుపు వేసి ఓ నిమిషం వేగాక దించి ఓట్స్‌ పొడిలో కలపాలి.

– ఆ మిశ్రమంలో పెరుగు, తగినంత ఉప్పు వేసి కలిపి ఇడ్లీ మిశ్రమంలా చేయాలి. ఇప్పుడు మిశ్రమాన్ని నెయ్యి రాసిన ఇడ్లీ ప్లేట్లలో వేసి దాదాపు 15 నిమిషాలు ఉడికించాలి. వేడి వేడి ఓట్స్ ఇడ్లీలు రెడీ. వీటిని డైరెక్టుగా తినేయవచ్చు. చట్నీ కూడా అవసరం లేదు. కావాలనుకుంటే చట్నీ కూడా చేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!