Meeku Telusa

Alluri Sitharamaraju | మన్యం దొర అల్లూరి సీతారామరాజు

అతను కనబడితే దేశద్రోహులకు వణుకు పుడతది… బాణం ఎక్కుపెడితే ఏం పరాయి పాలకుల గుండెదడ పుడతది… ఎదురుపడితే తెల్లదొరల పైబడి చమట ధార గడతది … మన్యం లో ఉండే చెట్టు చేమ అతనికి బాంచన్ అంటది… ఇంటిపేరు అల్లూరి సాకింది గోదారి… అతనే మా మన్యం దొర అల్లూరి సీతారామరాజు….

ఏజెన్సీ ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ల దురాగతాలు స్త్రీలపై అకృత్యాలు నిత్యకృత్యంగా ఉండేది. అప్పటికే దేశభక్తిని పుణికిపుచ్చుకున్న అల్లూరి గిరిజనులకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. సమయం దొరికినప్పుడల్లా వాళ్లకు హక్కుల గురించి చెబుతూ ధైర్యం నూరిపోసే పోసేవారు… క్రమంగా దాదాపు 40 గ్రామాల గిరిజనులకు రాజు, నాయకుడు అయిపోయాడు. యువకులకు యుద్ధవిద్యలు గెరిల్లా యుద్ధపద్ధతులు నేర్పి పోరాటానికి సిద్ధం చేశాడాయన

ఆ క్రమంలోనే గంటందొర , మల్లుదొర సీతారామరాజు ముఖ్య అనుచరుల పోయారు. దాదాపు నూట యాభై మందిని మెరికల్లా తయారుచేశాడు సీతారామరాజు.

1922 ఆగష్టు 22న మన్యంలో తిరుగుబాటు ప్రారంభం అయింది. రంపచోడవరం ఏజెన్సీలోని చింతపల్లి పోలీస్ స్టేషన్ పై 300 మంది విప్లవ వీరులతో సీతా రామ రాజు దాడి చేసి రికార్డులను ధ్వంసం చేసి తుపాకులు మందుగుండు సామాగ్రిని దోచుకున్నాడు. ఏమేం దోచుకెళ్లారు కూడా రికార్డు పుస్తకంలో రాసి రాజు సంతకం చేసాడు.

ఇలాంటి ఎన్నో వరుస దాడులతో ఉక్కిరిబిక్కిరైన బ్రిటిష్ అధికారులు రాజు నేతృత్వంలోని విప్లవ దళాన్ని మట్టుబెట్టడానికి రూథర్ ఫర్డ్ ని కలెక్టర్ గా నియమించింది. దీంతో కృష్ణదేవిపేటలో సభ నిర్వహించిన రూథర్ ఫర్డ్ … సీతారామరాజు ఆచూకీ చెప్పకపోతే గిరిజనుల అందరినీ కాల్చేస్తామని చెప్పడం వారిని చిత్రహింసలకు గురి చేయడం అల్లూరి సీతారామరాజుకు తెలియడంతో తన వల్ల అమాయకులు బలి కాకూడదని భావించి సంధి కోసం నిజాయితీగా బ్రిటిష్ వారి ముందుకు రాగా బ్రిటీష్ సైన్యం సీతారామరాజు నిర్బంధించి చెట్టుకు కట్టి 1924 మే 7వ తేదీన కాల్చి చంపింది

సీతారామరాజు అంటే ఓ మహోజ్వల శక్తి కేవలం 27 ఏళ్ళ వయసులోనే ఆయన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఢీకొని, సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం సాధ్యమని నమ్మి భారత స్వాతంత్ర సాయుధపోరాటంలో ఓ ప్రత్యేక అధ్యాయం లిఖించారు. అల్లూరి సీతారామరాజు చేసిన మన్యం విప్లవాన్ని, ఆయన దేశభక్తిని, త్యాగాన్ని గాంధీజీ 1929 జూలై 18న ప్రస్తావిస్తూ అభినందించారు కూడా.

గతేడాది అల్లూరి 125వ జయంతిని పురస్కరించుకుని ఆజాదికా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఆవిష్కరించారు. ఆయన జయంతిని పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ సంబంధిత ప్రభుత్వాలు ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నాయి. స్వాతంత్ర సమర యోధుడిగా ఈ మన్యం వీరుడు మనందరి గుండెల్లో చిరకాలం నిలిచిపోతారు… జైహింద్

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!