మన దేశంలో చాలామందికి ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయమే.. లాభమైనా , నష్టమైనా భరిస్తూ ప్రజలు నేలతల్లిని నమ్ముకుని నానా కష్టాలు పడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటారు. అయితే ఎప్పుడూ చేసే వ్యవసాయం కాకుండా కొంత భిన్నంగా చేసే సాగుతో ఎలాంటి సమస్యలు లేకుండా హాయిగా ఏళ్ల తరబడి ఆదాయం పొందొచ్చు. అలంటి భిన్నమైన మార్గమే వెదురు వ్యవసాయం.
వెదురు చెట్లను పెంపకానికి రసాయనాలు, పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ ఏవీ కూడా అవసరం ఉండదు. వేస్ట్ ల్యాండ్‌లో సైతం పెరిగి.. పర్యావరణాన్ని కాపాడుతుంది వెదురు. అలాగే ప్రతిసారి ఈ చెట్లను నాటాల్సిన పని ఉండదు. ఒక్కసారి నాటితే 40 ఏళ్లు రాబడి పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ బ్యాంబో చెట్లలో 136 రకాలు ఉంటాయి. అందువల్ల మీరు మంచి రకాన్ని ఎంచుకుని పెంచితే మంచి ఆదాయం పొందవచ్చు.
అలాగే ఈ వెదురు పంట కోసం ఇతర పంటల మాదిరిగా ప్రత్యేకంగా భూమిని సిద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఒక్కో హెక్టారుకు 1500 వెదురు మొక్కలు నాటవచ్చు. వెదురు మొక్కల కొమ్మలను ఎప్పటికప్పుడు కోస్తూ వాటిని సరైన విధానంలో పెంచగలిగితే చాలు. వెదురును గ్రీన్ గోల్డ్ అని కూడా అంటారు. దేశంలో వెదురు సాగును ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం 2006- 2007 సంవత్సరంలో నేషనల్ bamboo మిషన్ ను కూడా ప్రారంభించింది. దీని సాగుకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ కూడా లభిస్తుంది. వెదురు పెంపకం ఇతర పంటల కంటే మెరుగైనది సులభమైనది కూడా.
అంతే కాకుండా ఈ వెదురును సీజన్తో సంబంధం లేకుండా సాగు చేసుకునే వెసులుబాటు ఉండటమే కాకుండా మంచి సంపాదన కూడా లభిస్తుంది. అన్నిటికంటే ఎక్కువగా ఇందులో నష్టం అనే మాటే ఉండదు. వెదురు ప్రపంచవ్యాప్తంగా చాలా డిమాండ్ ఉంది. చైనా , జపాన్, థాయిలాండ్, ఇండోనేషియా వంటి దేశాల్లో ఈ వెదురుతో ఇళ్ల నిర్మాణం కూడా చేస్తుంటారు. అంతేకాకుండా మన దేశంతో పాటు ఎన్నో దేశాల్లో పరిశ్రమల్లో, ఫర్నీచర్ ఇండస్ట్రీలలో , తలుపులు కిటికీలు కుర్చీలు ఇతర ఫర్నిచర్, అలంకరణ వస్తువులు ఇలా రకరకాల వస్తువుల తయారీలో వెదురును ఉపయోగిస్తారు. వెదురు ఆకులు పశుగ్రాసంగా కూడా ఉపయోగపడతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే వెదురు అంతర్జాతీయంగా చాలా డిమాండ్ ఉంది. అందుకే ఈ వ్యాపారంలో నష్టం అనేది ఉండదు. కేవలం మనం సాగు చేసే వెదురు మంచి మేలు రకమైన అయితే చాలు.
ఒక వెదురు మొక్క ధర 250 రూపాయలు అయితే ఒక హెక్టారుకు 1500 వెదురు మొక్కలు పెంచవచ్చు అంటే ఒక హెక్టారుకు మూడు లక్షల డెబ్భై అయిదు వేలరూపాయల పెట్టుబడి అవుతుంది. ఈ వెదురు మొక్కల పెంపకం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ వెదురు మిషన్ ద్వారా ఈ మొత్తంలో 50 శాతం వరకూ ప్రభుత్వం నుంచి సబ్సిడీ లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం వెదురు చెట్ల పెంపకానికి సబ్సిడీ కూడా అందిస్తోంది. ఒక్కో చెట్టుకు రూ.120 వరకు సబ్సిడీ అందిస్తోంది. దీనికి సంబందించిన వివరాలకోసం మీ సమీపంలోని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నందు మొత్తం సమాచారం తెలుసుకోవచ్చు. లేదా మీరు గూగుల్ ద్వారా కూడా ఈ బిజినెస్ లో సబ్సిడీ గురించి తెలుసుకోవచ్చు.
ఒక హెక్టారు భూమిలో 625 వరకు వెదురు మొక్కలను పెంచవచ్చు. వెదురు సాగుకు ఇసుక నేలలు పనికి రావు. 2 అడుగుల లోతు, 2 అడుగుల వెడల్పుతో గుంతలు తవ్వి.. వెదురును నాటుకోవాలి. ఆ తర్వాత పశువుల పేడను ఎరువువగా వేయాల్సి ఉంటుంది. .నాటిన వెంటనే మొక్కకు నీరు పోయాలి. ఒక నెలపాటు ప్రతిరోజూ నీరందించాలి. 6 నెలల తర్వాత ఒక వారానికి ఒకసారి ఇస్తే సరిపోతుంది. మూడు నెలల్లో మొక్క పెరగడం ప్రారంభమవుతుంది. కొమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ ఉండాలి. అప్పుడే వెదురు కాండం చాలా పొడవు పెరుగుతుంది. నాటిన 3-4 సంవత్సరాలలో ఇవి కోతకు వస్తాయి.
మొత్తం ఖర్చులు పోను ఒక్కసారి రెండు నుంచి మూడు లక్షలు ఖర్చు చేస్తే ఆ తర్వాత మొదటి పంట మూడు నుంచి నాలుగు సంవత్సరాలకు చేతికి వస్తుంది. ఒక హెక్టారు పంటను ఎలా లేదన్నా ఐదు నుంచి ఏడు లక్షల వరకూ విక్రయించవచ్చు. అందులో పెట్టుబడి మూడు లక్షల డెబ్భై అయిదు వేలరూపాయల పెట్టుబడి తీసివేస్తే మిగతాదంతా లాభమే… అయితే అక్కడి నుంచి ఇకపై పెట్టుబడి లేకుండానే ప్రతి సంవత్సరం లక్షల్లో ఆదాయం వస్తుంది. అది కూడా దాదాపు 40 ఏళ్లపాటు ఎలా లేదన్నా ఒక్కో దఫా 3 నుంచి 5 లక్షల ఆదాయం చేతికి వస్తూనే ఉంటుంది. అంటే ఒకసారి పెట్టుబడి పెడితే జీవితకాలం ఆదాయం అన్నమాట.
Leave a Comment