16-07-1972న భారత పోలీస్ వ్యవస్థలోనే సంచలనం చోటు చేసుకుంది. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఒక మహిళ ఐపీఎస్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించింది. అమృత్‌సర్‌కు చెందిన డా.కిరణ్ బేడి ఈ ఘనత సాధించి చరిత్ర సృష్టించింది. 1972లో జూలైలో మొట్టమొదటి ఐ.పి.యస్ గా ఎన్నికైనారు.1973 జనవరి 26న జరిగిన రిపబ్లిక్ డే పెరేడ్ సందర్భంగా మొట్టమొదట మహిళా ఐ.పి.యస్ ను చూసిన ప్రజలు ఆనందాశ్చర్యాలకి లోనయ్యారు. ఆ మరుసటిరోజే అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ఈమెను అల్పాహారానికి ఆహ్వానించింది.
కిరణ్ బేడీ భారతదేశపు మొట్టమొదటి ఐ.పి.ఎస్.అధికారిణి. 1972 బ్యాచ్‌కు చెందింది. పోలీసు శాఖలో అనేక పదవులు చేపట్టి, అనేక సంస్కరణలు చేపట్టిన కిరణ్ బేడీ జూన్ 9, 1949 పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్లో ప్రకాశ్ రావ్ పేశవారియా, ప్రేమలత పేశవరియా అనేదంపతలుకి జన్మించింది. తల్లిదండ్రులకు 4 కూతూర్లలో ఈమె రెండవది. డిగ్రీ వరకు స్థానికంగా అమృత్‌సర్ లోనే విద్యాభాసం కొనసాగించింది. 1968-70లో రాజనీతి శాస్త్రంలో పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీగర్ నుంచి ఎం.ఏ.పట్టా పొందినది.
ఉద్యోగంలో చేరిన తరువాత 1988లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పట్టా పొందినది. 1993లో ఢిల్లీ ఐ.ఐ.టి. పి.హెచ్.డి. పట్టాను ప్రధానం చేసింది. కిరణ్ బేడీ చిన్న వయస్సులో మంచి క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. అద్భుతమైన టెన్నిస్ ఆటగాడైన ఆమె తండ్రి అదే క్రీడలో తన కుమార్తెలకు శిక్షణ ఇచ్చాడు. తన తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతో కిరణ్ బేడీ అఖిల భారత టెన్నిస్ టైటిల్, ఆల్ ఏషియన్ టెన్నిస్ టైటిల్‌ను గెలుపొందారు. 22 ఏళ్ళ వయసులో ఏషియా మహిళల టైటిల్ ను కూడా సాధించారు.
క్రీడాకారిణిగా విజయాలు
*1975 లో అల్-ఇండియా ఇంటర్స్టేట్ వుమెన్స్ లాన్ టెన్నిస్ ఛాంపియన్ షిప్.
*1976 లో జాతీయ మహిళల లాన్ టెన్నిస్ ఛాంపియన్ షిప్.
*1965 నుండి 1978 వరకు దేశవ్యాప్తంగా అనేక జోనల్ మరియు స్టేట్ లాన్ టెన్నిస్ ఛాంపియన్ షిప్.
* శ్రీలంకకు వ్యతిరేకంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి లియోనెల్ ఫొంన్కా మెమోరియల్ ట్రోఫి.
ఉద్యోగ జీవితం
కిరణ్ బేడీ అమృత్‌సర్ లోని ఖాల్సా మహిళల కళాశాలలో రాజనీతి శాస్త్రంలో ఉపన్యాసకురాలిగా తొలుత తన ఉద్యోగజీవితం ప్రారంభించారు.
ఒక IPS అధికారిగా కిరణ్ బేడీ జీవిత గమనం
కిరణ్ బేడీ మౌంట్ అబూ వద్ద నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందిన తరువాత 1972 లో ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) లో చేరారు. ఢిల్లీలోని చాణక్యపురి పోలీస్ స్టేషన్లో సబ్ డివిజినల్ పోలీస్ ఆఫీసర్ గా ఆమెను తొలుత నియమించారు. రాష్ట్రపతి భవన్, పిఎమ్ హౌస్, లౌటీన్స్ ఢిల్లీ, పలు కీలక ప్రభుత్వ అధికారులు, మంత్రుల కార్యాలయాలను ఆమె కలుపుకుంది. ఆమె 1975 లో రిపబ్లిక్ డే పరేడ్లో ఢిల్లీ పోలీస్ మగ బృందానికి నాయకత్వం వహించిన మొట్టమొదటి మహిళా అధికారి అయ్యారు. ఢిల్లీలో ట్రాఫిక్ పోలీస్ కమీషనర్‌గా, మిజోరాంలో డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆప్ పోలీస్‌గా, చండీగఢ్ లెప్టినెంట్ గవర్నర్ సలహాదారునిగా, ఐక్యరాజ్య సమితిలోనూ పనిచేశారు.
ఢిల్లీ ట్రాఫిక్ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్‌గా క్రేన్ బేడీ అనిపించుకున్న కిరణ్ బేడీ ధైర్యసాహసాలు:
ఢిల్లీ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ గా ధైర్యసాహసాలతో తన బాధ్యతలను నిర్వహించారు. రోడ్లపై ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన కార్లను క్రేన్లతో పారద్రోలి క్రేన్ బేడీగా ప్రసిద్ధిగాంచారు. తీహార్ జైలులో పలు సంస్కరణలు ప్రవేశపెట్టి అందరి మన్ననలను పొందారు.
1982లో ప్రధాని ఇందిరాగాంధి కారుని ప్రవేశంలేని చోట ఆపివుంచిన కారణంతో క్రేన్ సహాయంతో అక్కడనుండి తీయించి వేశారు. ఒక ప్రధానమంత్రి కారు అయినా సరే నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె ధైర్యసాహసాలతో ఋజువు చేశారు. ఆసమయాన ఆమెచూపిన కర్తవ్యనిర్వాహణపట్ల ముగ్డులైన ప్రజలు ఆమెను క్రేన్ బేడి అని పిలిచేవారు. అటు తరువాత 9 వేల మంది ఖైదీలున్న తీహార్ జైలకు బదిలీ అయ్యాక అక్కడ ఖైదీల పట్ల సేవాదృక్పథాన్ని ప్రదర్శించింది. జైలులో ఎన్నో సంస్కరణలు చేసింది.
కిరణ్ బేడీ నవంబరు 27, 2007 న తన విధులనుండి స్వచ్ఛంద విరమణను పొందారు.
ఉద్యమ జీవితం
ఉద్యోగం నుండి పదవి విరమణ తీసుకున్న కిరణ్ బేడీ సామాజిక కార్యకర్త అన్నా హజారే నేతృత్వంలోని ‘ఇండియా అగైన్స్ట్ కరప్షన్’ (IAC) ఉద్యమంలో కీలక పాత్రను పోషించింది. లోక్ పాల్ బిల్లుకోసం అన్నాహజారే చేస్తున్న దీక్షకు ఆమె సంపూర్ణ మద్దతును అందించారు. లోక్ పాల్ బిల్లుకు సంబంధించి ప్రభుత్వం, ఉద్యమకారులకు మధ్యన జరిగిన చర్చలలో ఆమె పాల్గొన్నారు. అన్నా హజారే యొక్క ప్రణాళికాబద్ధమైన నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించటానికి ముందు ఉద్యమంలోని ఇతర సభ్యులతో పాటు కిరణ్ బేడీని కూడా కొన్ని గంటల పాటు అరెస్టు చేశారు. లోక్ పాల్ బిల్లు ముసాయిదాలో మూడు పాయింట్లను పరిశీలించాలని పార్లమెంటు ఆమోదం తెలిపింది.
రాజకీయ జీవితం
2014 లో జరిగిన సార్వత్రికఎన్నికలలో ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి ఆమె తన మద్దతును ప్రకటించారు. అటు తరువాత ఆమె 2015 జనవరి 15 న భారతీయ జనతా పార్టీ లో అధికారికంగా చేరారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించబడి బేడీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.
గవర్నర్‌గా కిరణ్ బేడి ఉదారత
భారత ప్రభుత్వం 2016 మే నెలలో కిరణ్ బేడీని పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమించింది. ఆ సమయంలో పాండిచ్చేరి గవర్నర్‌గా ఉన్న కిరణ్ బేడి ఒక కార్యక్రమానికి హాజరవ్వడానికి గత సంవత్సరం డిసెంబర్ నెలలో పుదుచ్చేరి తందై పెరియార్ నగర్‌లోని సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా తనకు ఆహ్వానం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ, సత్కారానికి వినియోగించిన శాలువాకు సంబంధించిన నగదును పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కిరణ్ బేడి తిరిగి చెల్లించారు. కార్యాలయ ప్రవేశద్వారంలో తనకు ఆహ్వానం తెలుపుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని పరిశీలించిన గవర్నర్, ఆ ఫ్లెక్సీపై ఉన్న సాంఘీక సంక్షేమ శాఖ డైరెక్టర్ సారంగపాణిని పిలిచి, ఫ్లెక్లీ ఏర్పాటుకు ఎంత ఖర్చు అయింది అని ప్రశ్నించగా, ఆయన రూ.500 అని బదులిచ్చారు. దీంతో, తన భద్రతాదళ పోలీసు నుంచి రూ.500 తీసుకున్న గవర్నర్ అధికారికి అందజేశారు. అలాగే, కార్యక్రమంలో ఓ అధికారి శాలువాతో సత్కరించగా, అందుకైన రూ.750లను కూడా గవర్నర్ కిరణ్ బేడి తిరిగి చెల్లించి ఆమె తన ఉదారతను చాటుకున్నారు.
సామాజిక సేవ
కిరణ్ బేడీ సమాజానికి చేసిన సేవ అపారమైనది. నవజ్యోతి, ఇండియన్ ఫౌండేషన్ అను రెండు స్వచ్ఛందసంస్థలను స్థాపించి మాదకద్రవ్యాలకు బానిసలైన వ్యక్తులను తిరిగి నవజీవనస్రవంతిలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు.
స్ఫూర్తి దాయినిగా కిరణ్ బేడీ
పాత రోజులలో మన సమాజంలో స్త్రీలు ఉద్యోగం చేయడం అన్నది చాలా అరుదుగా ఉండేది. ఇక పొలిసు ఉద్యోగాలకు స్త్రీలు అసలు దరఖాస్తు కూడా చేసే వారు కాదు. అటువంటి రోజులలో కిరణ్ బేడీ మొట్టమొదటి ఐపియస్ గా ధైర్యసాహసాలతో తన వృత్తిని నిర్వహించారు. ఎక్కడ కూడా తన విధుల నిర్వహణలో రాజీపడలేదు. ఈరోజున సివిల్స్ కు సన్నద్ధమవుతున్న అమ్మాయిలలో ఎంతో మంది తమ లక్ష్యం ఐపియస్ అని, తమకు స్ఫూర్తి కిరణ్ బేడీ అని అంటున్నారంటే కిరణ్ బేడీ మహిళలో ఎటువంటి స్ఫూర్తిని రగిలించారో అర్థంచేసుకోవచ్చు.