Meeku Telusa

క్రికెట్ డెవిల్.. కపిల్ దేవ్ | Kapildev Motivational Biography in Telugu

పోరాడితే పోయేది లేదు.. అనేది ఓ విప్లవ నినాదం. క్రికెట్ లో కూడా పోరాడితే పోయేది లేదంటూ గెలుపే లక్ష్యంగా ఆడిన యోధుడు కపిల్ దేవ్. 19 ఏళ్ల వయసులో పాకిస్తాన్ తో మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడిన కపిల్, హర్యానా హరికేన్ అనే ఖ్యాతిని పొందడానికి కారణం, అతడిలోని తెగింపే. ఒకప్పుడు వన్డే టోర్నీల్లో భారత జట్టు పసికూన. ప్రతి జట్టూ వీలైనంత రికార్డు మెజారిటీతో గెలవడానికి ఉపయోగ పడే ఒక బచ్చా టీమ్ గా భావించేవారు. కపిల్ దేవ్ కెప్టెన్సీలో భారత్ 1983 ప్రపంచ కప్ ను గెలవడం ఓ సంచలనం. అప్పటికి రెండు ప్రపంచ కప్ టోర్నీలు జరిగాయి. భారత్ అలా వెళ్లి వీలైనన్ని మ్యాచ్ లు ఓడి తిరిగి వచ్చేది. 1983లో కూడా అదే జరుగుతుందని అంతా అనుకున్నారు. కానీ కపిల్ స్టయిల్ వేరు. ఎలాగూ ఆడుతున్నాం. తెగించి ఆడితే కప్పు గెలవవచ్చు అని బలంగా నమ్మాడు.


అప్పటికే సీనియర్ క్రికెటర్ గవాస్కర్ కెప్టెన్సీలో భారత్ ప్రపంచ కప్ టోర్నీలో పరాజయ పరంపర కొనసాగించింది. మనకు వరల్డ్ కప్ ఏం వస్తుంది అని టీమిండియా క్రికెటర్లు అనుకునే రోజులవి. కపిల్ మాత్రం మనం ఇంగ్లండ్ వెళ్లేది కప్ గెలవడానికే అని జట్టులో స్థయిర్యం నూరిపోశారు. విజయకాంక్షను రగిలించాడు. ప్రపంచ కప్ గెలిచే సత్తా మనకుందని నమ్మకం కలిగించాడు. అంతే, ప్రుడెన్షియల్ ప్రపంచ కప్పును గెల్చుకుంది భారత్. న్యూజిలాండ్ తో మ్యాచ్ లో భారత్ ఓటమి అంచుల వరకూ వెళ్లింది. కపిల్ ఒక్కడే వీర విహారం చేసి 175 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. జట్టును గెలిపించాడు. ఆ గెలుపు తర్వాతే భారత్ సెమీస్ కు వెళ్లింది. ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ ను ఓడించి కప్పును గెల్చుకుంది. అదే టోర్నీలో విండీస్ ను రెండు సార్లు ఓడించారు కపిల్స్ డెవిల్స్.

బంతిని బాంబుల్లా విసిరే మీడియం పేస్ బౌలర్ గా, ధాటిగా బ్యాటును ఝళిపించే బ్యాట్స్ మన్ గా, అరుదైన ఆల్ రౌండర్ గా కపిల్ దేవ్ పేరు క్రికెట్ చరిత్రలో చిర స్థాయిగా నిలిచిపోతుంది. చండీగఢ్ లో 1959 జనవరి 6న జన్మించిన కపిల్, 1978లో పాక్ తో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. వన్డేలు, టెస్టుల్లో కూడా ధాటిగా ఆడటం కపిల్ స్టయిల్. ఒకే టెస్ట్ మ్యాచ్ లో ఐదు వికెట్లు పడగొట్టడం అనే ఘనతను 23 సార్లు సాధించాడు. ఒకే టెస్ట్ మ్యాచ్ లో 10 వికెట్లు పడగొట్టడం అనే ఘనతను రెండు సార్లు సొంతం చేసుకున్నాడు. బ్యాట్స్ మన్ గా టెస్టుల్లో 8, వన్డేల్లో ఒక సెంచరీ చేశాడు. హర్యానా హరికేన్ గా, డ్యాషింగ్ క్రికెటర్ గా, క్రికెట్ డెవిల్ గా కపిల్ కు పేరుంది. మైదానంలోకి దిగామంటే గెలవాల్సిందే అనే కసితో కపిల్ ఆడే వాడు. అందుకే, కపిల్ ఉన్న జట్టును ఓడించడం కష్టం అని అప్పటి బలమైన జట్టు విండీస్ క్రికెటర్లు కూడా భావించేవారు.

భారత్ లో ఐపీఎల్ రావడానికి ఒక రకంగా కపిల్ పరోక్ష కారకుడు. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత కపిల్ గోల్ఫ్ ఆటలోని మజాను ఆస్వాదించడం మొదలుపెట్టాడు. జీ టీవీ అధినేత సుభాష్ చంద్ర ఇండియన్ క్రికెట్ లీగ్ ప్రారంభించాలని నిర్ణయించాడు. కపిల్ దేవ్ ను సంప్రదించాడు. వీరిద్దరూ కలిసి 2007లో ఐసీఎల్ ను ప్రారంభించారు. అయితే 2009లోనే దాని కథ ముగిసిపోయింది. బీసీసీఐ పెద్దలు ఐసీఎల్ పై కక్షగట్టడమే దీనికి కారణం. ఐసీఎల్ లో ఆడిన వారికి టీమిండియాలో చోటు ఇచ్చేది లేదని చెప్పడంతో దీని కథ ముగిసింది. ఆ తర్వాత దీనికి పోటీగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మొదలైంది. కపిల్ ప్రస్తుతం క్రికెట్ అడ్వయిజరీ కమిటీ చీఫ్‌ గా ఉన్నాడు. 1991లో పద్మభూషణ్ పురస్కారం పొందిన కపిల్, ఇంకా ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాడు. 2002లో విజ్డెన్ ఇండియన్ క్రికెటర్ ఆఫ్‌ ద సెంచరీగా ఎంపికయ్యాడు. ఆడేది గెలవడానికే అనే స్ఫూర్తితో కపిల్ ఇప్పటికీ యువ క్రీడాకారుల్లో ఉత్తేజం నింపడానికి ప్రయత్నిస్తున్నాడు.

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!