శరదృతువులో మేఘాలు వర్షించి జగత్తుకు కలిగిన తాపాన్ని తొలగిస్తున్నాయి . అదే విధంగా శరదృతువులో ప్రారంభమయ్యే అమ్మవారి శరన్నవరాత్రుల పూజా ఫలితాలు మనుషుల్లో ఉన్న అజ్ఞాన తాపాన్ని తొలగిస్తున్నాయి . ఈ ఋతువులో తానూ ప్రకృతి రూపంతో ఎంత పచ్చగా వికసిస్తుందో అలాగే మనుషుల్లో జ్ఞానరూపమై సంప్రధూపమై నిలుస్తుంది ఆ జగన్మాత.
అమ్మలగన్న అమ్మ ముమ్మూర్తులకు ఆది దేవత . అన్ని లోకాలకు పాలించే జగన్మాత, శ్రీ విజయ దుర్గాదేవిగా కడప పట్టణంలో వెలసింది. ఏనాటి పుణ్యమో ఎన్ని జన్మల సుకృతమో ఈ తల్లి మన నగర వాకిట నిలిచి మనందరి అరచేతి మాణిక్యంగా అలరారుతుంది . పట్టణానికి పడమటి దిక్కున తూర్పుముఖంగా కుదిరిన యోగ్యమైన పవిత్ర స్థలంలో కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారి ప్రక్కన అమ్మవారు కొలువుదీరింది.
శిల్పకళ , వాస్తు, ఆగమ శాస్త్రజ్ఞులు సాంకేతిక నిపుణులు ఎందరో పండితుల సలహాలను, సూచనలను పాటించి ఏంతో మంది కార్మికులతో అహర్నిశలు శ్రమించి ఈ ఆలయాన్ని నిర్మించినవారు ” శ్రీ దుర్గా ఆటో మోటివ్స్ ” అధినేత శ్రీ సుధా మల్లికార్జున రావు గారు,. వీరు తన సమయ , వ్యయ , ప్రయాసలను వెచ్చించి ఆలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంలా మలిచారు.
అమ్మ అనుగ్రహం అందరికీ కావాలి ! అమ్మ దయ ఉంటె చాలు అన్ని సమకూరుతాయి ! ఆ అమ్మ ప్రేమ కోసం మనమంతా ఆరాటపడాలి ! అందరిలో భక్తి భావం పెంపొందాలి అంటారు ఆలయ వ్యవస్థాపకులు . ఈ వినమ్రత, ఈ ఔదార్యమే వారిని సామాన్య మానవ జీవన స్థితి నుంచి మహా మనిషి గా తీర్చిదిద్దింది . నేను కాదు కర్తను మనందరికీ అమ్మవారి కరుణయే కారణం , ఇదంతా అమ్మ ఆశీర్వాద భలం , జరిగే కార్యక్రమాన్ని అమ్మ సంకల్ప రూపాలే అంటారు శ్రీ సుధా మల్లికార్జున రావు గారు.
పురాతన ఆలయ నిర్మాణ సంప్రదాయాన్ని పుణికి పుచ్చుకున్నట్టుగా ఆగమ శాస్త్ర నియమాలకు అనుగుణంగా ఆలయ నిర్మాణం జరిగింది . రండి ! రారండి ! అమ్మను దర్శించి తరించండి అని ఆహ్వానిస్తున్నట్లుగా సుందరమైన సింహద్వారం స్వాగతం పలుకుతుంది . యాత్రికులకు , బాటసారులకు బహుదూరం నుంచి గమనించినా అమ్మవారి నివాసం ఇదే ! అని సూచించే విధంగా 46 అడుగుల ఎత్తేన ధ్వజ స్తంభం కనబడుతుంది. అమ్మవారికి ఎదురుగా ఆమెకు ఏంటో ప్రీతి అయినట్టి వాహనం మృగరాజును ప్రతిష్టించారు. ఎల్లయ్య మండపంలో పరమ పవిత్రమైన శ్రీ చక్రమేరువును ప్రతిష్టించారు . సహజంగా ఆ అన్ని చోట్ల భక్తుల గోత్రనామాలతో అర్చకులు శ్రీ చక్రార్చన చేస్తారు. కానీ ఈ విజయ దుర్గా దేవి ఆలయంలో భక్తుల చేత స్వయంగా శ్రీ చక్రార్చన చేయిస్తారు. ” మూలమంత్రాత్మికా ములకుటత్రయ కళేబరా ” సరస్వతి, లక్ష్మి , పార్వతి అనే ముగ్గురు శక్తులతో కూడినది శ్రీ చక్రం. శ్రీ చక్రాన్ని పూజించిన వారికి సర్వస్వతి విద్యను, లక్ష్మి సంపదను, పార్వతి శక్తిని సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది అని లలితా సహస్రనామాలలో చెప్పబడింది .
ఇక ముఖ్యమైనది అమ్మవారి విగ్రహం. ఆలయ మండపం నుంచి కొంచెం ముందుకు వెళితే చతుర్విధ ఫలపురుషార్థాలను ప్రసాదించే ఆ తల్లి శ్రీ విజయదుర్గా దేవి సరిగ్గా నాల్గవ వాకిట దర్శనమిస్తుంది . ” సహస్రరతి సౌందర్య శరీరాయైనమొనమః ” అనే ఆమె నామ వైభవాన్ని ప్రత్యక్షంగా చూడవచ్చు. ఎంత చుసిన తనివి తీరని ఆ రూపం , చిరు దరహాసంతో కూడిన అమ్మ వారి ముఖారవిందం భక్తుల్ని పలకరిస్తున్నట్లు అనిపిస్తుంది . శంఖము , చక్రము, గద , ఖడ్గము మొదలైన ఆయుధాలు ధరించి సూర్యచంద్రులను సిగలో సింగారించుకొని అభయ హస్తాన్ని చూపుతూ సర్వమంగళ అయినా అమ్మ మనకు దర్శనమిస్తుంది . ఒక సారి దర్శించిన వారు పునర్దర్శనానికి తహతహలాడతారు. మనిషి పురోగతి , గ్రహస్థితిపైన ఆధారపడి ఉంది అన్నది జ్యోతిష్య శాస్త్రజ్ఞుల అభిప్రాయం , ఆ గ్రహాలూ కూడా పరాశక్తి ఆధీనంలోనే సంచరిస్తున్నాయి కాబట్టి నవగ్రహాలను ఆయాల ఈశాన్య భాగంలో ప్రతిష్టించారు.
విజయాలకు మూలమైన ఈ విజయ దుర్గమ్మ కడపలో కొలువైనది మొదలు నేటి వరకు భక్తులు తండోప తండాలుగా వస్తున్నారు. ప్రతి మంగళ , శుక్రవారాలలో జరిగే విశేష పూజలలో అశేషంగా పాల్గొంటారు. కష్టాలు తీర్చుకొంటున్నారు. కోరికలు నెరవేర్చుకొంటున్నారు. నిత్యా, వార, పక్ష, వార్షిక మహోత్సవాలలో పాల్గొని భక్తులు తరిస్తున్నారు. ఇప్పుడు కడప నగరంలో ఈ విజయదుర్గా ఆలయం సందర్శకులకు గొప్ప పర్యాటక క్షేత్రంలా మారింది.
* శ్రీ విజయదుర్గా దేవ్యైనమః *
ఆలయంలో జరిగే నిత్యా అర్చన మరియు విశేష పూజా కార్యక్రమాలను చూడగా ఏంటో ఆశ్చర్యం కలుగుతుంది . కారణం ఆలయ అర్చకులు చేయు ప్రతి ఉపచారము ఎదో సాధారణంగా చేస్తున్నట్టుగా మనకు అనిపించదు. స్వయంగా మాతృమూర్తికి కుమారులు ప్రేమతో పరిచర్య చేస్తున్నారా! అన్నట్లుగా ఉంటుంది . బ్రహ్మీ ముహూర్త సమయంలో మంగళవాయిద్యముల నడుమ అర్చకులు సుప్రభాత సేవను నిర్వహిస్తారు. అమ్మవారిని మెలోకొలిపేటి సన్నివేశం చూసే వారికి ఏంటో ఆనందాన్ని చేకూరుస్తుంది. అమ్మవారి అర్చనాది కార్యక్రమములను శాక్తేయ ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ప్రతి నిత్యం పవళింపు మూర్తికి అభిషేకాన్ని నిర్వహిస్తారు. అనంతరం సహస్రనామ, అష్టోత్తర శాత నామాలతో అర్చన చేసి మహా మంగళ హారతులను ఇస్తారు. ఈ మహామంగళహారతులను దర్శించిన వారికి కూడా మంగళం చేకూరుతుంది అని భక్తులు విశ్వసిస్తూ ప్రత్యేకంగా ఈ హారతులను దర్శించడానికి వస్తూ ఉంటారు. యధావిధిగా సాయంత్రం కూడా ఆరాధన నిర్వహించి రాత్రి 9 గంటలకు పవళింపు సేవ చేస్తారు. వారు జోలపాడి అమ్మవారిని నిద్రపుచ్చేటటువంటి సన్నివేశం చాలా వైభవంగా ఉంటుంది. నిత్యా యాంత్రిక జీవనంలో అలసి సొలసినటువంటి వారు మానసిక ప్రశాంతత పొందడము కోసం ప్రత్యేకించి ఈ సేవను దర్శిస్తారు.
కడప విజయదుర్గ అమ్మవారి మహిమ విశేషాలకు సాక్ష్యంగా సూర్యుడు మార్చి 17 నుండి 23 వ తేదీ వరకు దక్షిణాయణం నుండి ఉత్తరరాయణానికి , అలాగే సెప్టెంబర్ 18 నుండి 23 వ తేదీ వరకు ఉత్తరరాయణం నుండి దక్షిణాయనం వెళ్ళేటప్పుడు భూమధ్యరేఖను తాకుతూ ధృవం మారుతూ ఉంటాడు. ఆ సమయంలో తానూ ఆ అమ్మవారి దీవెనలను అందుకొని గడవబోయే కాలమంతా జగత్తుకంతటికి దేదీప్యమానమైన కాంతిని అందించడానికి కావలసిన శక్తిని పొందడానికైనా అన్నట్టుగా ! ఆ కాంతి కిరణాలు నేరుగా గర్భగుడిలోని అమ్మవారి పాదాలనుండి శిరస్సుదాకా వెళ్లి మరలా వెనక్కు వెళ్లిపోతాయి. ప్రతియేటా జరుగుతున్న ఈ వైజ్ఞానిక సాదృశ్యాన్ని దర్శించి, పులకరించి తరిస్తున్న వేళా భక్తులే ఇందుకు సాక్ష్యం . అష్టాదశ మహాశక్తిపీఠాలలో ఒకటైన కోర్హాపురం శ్రీ మహాలక్ష్మి ఆలయంలో ప్రతి ఏడాది సరిగ్గా ఇదే దృశ్యం కనపడుతుంది. ఆ మూడు రోజులు భక్తులు విశేషంగా వచ్చి దర్శిస్తుంటారు. ఈ విశేషాల్ని ” కిరణ్ ఉత్సవ్” అన్న పేరుతొ వైభవంగా జరుపుకొంటారు.
పంచామృతాభిషేకం : ప్రతి మంగళ వారము, శుక్రవారం మరియు పర్వదినములలో అమ్మవారికి పాలు, పెరుగు, తేనే, నెయ్యి, పంచదార, పండ్లరసములు, సుగంధ ద్రవ్యాలు, ఔషధులు, పసుపు, విభూది మొదలగు అభిషేక ద్రవ్యములతో మంగళ వాయిద్యముల నడుమ, సుస్వరవేద మంత్రోచ్ఛరణలతో విశేష పంచామృతాభిషేకము నిర్వహించబడును. అభిషేకానంతరం అలంకారము పూర్తీ అయినా తర్వాత సహస్రనామ అష్టోత్తర శతనామములతో కుంకుమార్చన అనంతరం నివేదన, మహామంగళ హారతి, మంత్రం పుష్పము,తీర్థ ప్రసాద వినియోగముతో అభిషేక ఉభయము పూర్తి అగును.
నవకలశ స్నపనము : ప్రతి నెల పౌర్ణమి నాడు తెల్లవారుజామున 4. ని. లకు అభిషేక ద్రవ్యములతో నింపబడి ప్రత్యేక ఆరాధన నిర్వహించబడిన 9 కలశములతో 9 మంది దంపతులు ఆలయము చుట్టూ మంగళ వాయిద్యములతో మూడు సార్లు ప్రదక్షణ చేసి మూడు లోకములలో ఉన్నటువంటి సమస్త నదీ జలాలను ఆ కలశములతో సేకరించినట్టుగా భావన చేస్తూ ఆలయం లోనికి చేరుకొని ఆ కలశములను అమ్మవారి అభిషేకార్థమై అర్చకులకు అందిస్తారు. ఈ విశేష అభిషేక సందర్శనం భక్తుల హృదయాలకు ఎంతో ఆనందాన్ని ప్రసాదిస్తుంది.
నవావరణ శ్రీ చక్రార్చన పూజ : శ్రీ చక్రము సర్వమైన శ్రీ విద్యకు ప్రేమ సూక్ష్మమైన రూపము తాంత్రికమతంలో ఉన్న యంత్రములలో శ్రీ చక్రము సర్వోత్కృష్టమైంది. శ్రీ చక్రమును మించిన యంత్రము లేదని మంత్ర శాస్త్రవేత్తల అభిప్రాయము. శ్రీ చక్ర మహిమను గూర్చి శంకర భగవత్ పాదాచార్యుల వారు సౌందర్యలహరి యందు శ్రీ చక్రరూపిణి అగు శ్రీ విద్యను పూజించుటచే శ్రీ మహావిష్ణువు మోహిని రూపమును ధరించి పరమ శివుని మోహింప చేయగల శక్తిని పొందెనని , మన్మధుడు శ్రీ చక్రమును అర్చించుటవలననే , జితేంద్రియులైన మహర్షులను కూడా చలింప చేయగలవాడయ్యెనని చెప్పియున్నారు. దీనిని బట్టి శ్రీ చక్ర ఆరాధన మహిమ ఏంటో అనాదిగా ప్రాశస్త్యంలో ఉందొ మనం ఊహించుకోవచ్చు. నివారణ సహితంగా శ్రీ చక్ర ఆరాధన చేసినటువంటి వారు సకల భోగభాగ్యములను , సుఖః సంతోషాలను, ఆధ్యాత్మిక శక్తిని పొందగలరు అనడంలో సందేహము లేదు. ఇక్కడ ఆలయ అర్చకులు ఏంటో నిష్ఠతో భక్తి శ్రద్దలతో శాక్తేయ ఆగమ సంప్రదాయానుసారంగా నవావరణ సహితంగా శ్రీ చక్రార్చన నిర్వహిస్తారు. అంతే కాకుండా భక్తులచేత స్వయంగా అర్చన చేయిస్తారు. ఇదే ఇక్కడకి ప్రత్యేకత.
ప్రతి నెల పౌర్ణమి నాడు సాయంత్రం 6 గంటలకు 108 దీపాలతో అమ్మవారికి ఒక విశేషమైనటువంటి అలంకార సేవ చేస్తారు. ఆ అలంకార దీపాలు 108 మంది దంపతుల పేర్లు , గోత్రాలతో విజయదుర్గా అష్టోత్తర శతనామాలను జపిస్తూ, ఒక్కొక్క నామంతో ఒక్కొక్క దీపాన్ని భక్తుల చేత తాకించి వెలిగిస్తారు. ఈ 108 దీపకాంతులతో కూడి అమ్మవారు ఒక తేజోవంతమైన జగత్కారణ రూపమైన దివ్య జ్యోతిగా దర్శనమిస్తూ భక్తులను కటాక్షిస్తుంది . పౌర్ణమి నాడు దుర్గమ్మ సన్నిధిలో ఈ దీపాలను వెలిగిస్తే వారి జీవితాలలో పేరుకున్న అంధకారాన్ని తొలగించి తమ హృదయాలలో జ్ఞాన జ్యోతిని విలిగింపచేసి అమ్మవారు వారిని తరింప చేస్తుంది అని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఈ విశేష సేవను దర్శించడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు.
చతుషష్టి ఉపచార పూజ : గణపతి , విష్ణువు, శివుడు, సూర్యుడు, దేవి ఈ అయిదుగురిని పంచాయతన దేవతలు అంటారు. వీరు ఒక్కొక్క విధమైనటువంటి ఆరాధనతో ప్రీతి చెందుతారు. గణపతి ఆరగింపు ప్రియుడు, సూర్యుడు నమస్కార ప్రియుడు , విష్ణువు అలంకారప్రియుడు , శివుడు అభిషేక ప్రియుడు., దేవి పూజాప్రియ . ప్రతి బహుళ చతుర్దశి నాడు అమ్మవారికి విశేషంగా 64 ఉపచారములతో ప్రత్యేకమైనటువంటి పూజను నిర్వహిస్తారు. దీనిని చతుషష్టి ఉపచార పూజ అంటారు. ఈ అర్చనను గూర్చి వర్ణించుటకన్నా ఎవరికి వారు పూజిస్తే ఆ ఆనందాన్ని పరిపూర్ణంగా పొందగలరు. ఇక్కడ ఈ చతుషష్టి ఉపచార పూజ చేయించిన వారందరు విశేషమైనటువంటి ఫలితములు పొందినట్టు వారే స్వయంగా చెబుతున్నారు.
జ్యోతిష్య శాస్త్రములో రాహు , కేతువులను సర్పాలుగా భావిస్తారు. రాహువును సర్పము యొక్క తలగా , కేతువును సర్పము యొక్క తోకగా చెబుతూ ఉంటారు. జాతక చక్రములో మిగిలిన ఏడు గ్రహములు రాహుకేతు గ్రహముల మధ్య ఉన్న కాలసర్ప దోషమందురు . దీనినే కాలసర్ప యోగము అని కూడా అంటారు. అన్ని రకాల చెడుయోగాల కన్నా కాలసర్ప యోగము చాలా భయంకరమైన, ఊహించని చేడు ఫలితము ఇస్తుందని జ్యోతిష్య శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ఈ యోగం పట్టిన వారు ఉద్యోగహీనులుగా , సుఖహీనులుగా , చెడ్డపనులు చేయువారుగా, అవివాహితులుగా,సంతానములేని వారుగా ఉంటారు. ఈ విధమైన చెడు ఫలితాల నుండి బయటపడి ఆనందకరమైన జీవితమును పొందగోరు వారు రాహుకాల సమయము నందు గ్రహారాధన చేసి అమ్మవారికి విశేషపూజతోపాటు ఎంతో ప్రీతియైన నిమ్మకాయలతో ఎనిమిది దీపములు వెలిగిస్తే సకల శుభములు కలుగుతాయని జ్యోతి శాస్త్రము చెబుతోంది. ఇట్టి రాహుకాల పూజను శ్రీ విజయదుర్గా దేవి ఆలయంలో ప్రతి మంగళ వారము భక్తులతో స్వయంగా చేయిస్తారు.
- తెల్లవారు జామున 4.00 గంటలకు : సుప్రభాత సేవ
- తెల్లవారు జామున 4.10 గంటలకు : అభిషేక కలశముల ఆరాధన
- తెల్లవారు జామున 4.30 గంటల నుండి ఉదయం 6. 30 గంటల వరకు : ఈ నవరాత్రులలో ఒక్కొక్కరోజు ఒక్కొక్క సంఖ్యతో ఔషధులు, లోహములు, రత్నములు , వివిధరకమైన అభిషేక ద్రవ్యములతో విశేష విశేష అభిషేకము జరుగును.
- ఉదయం 6.30 గంటల నుండి ఉదయం 8. 00 గంటల వరకు : అమ్మవారికి అలంకార సేవ ( ఈ సమయంలో భక్తులకు దర్శనము లభించదు)
- ఉదయం 8.00 గంటలకు : సహస్రనామార్చన
- ఉదయం 8.20 గంటలకు : మహా మంగళ హారతి, మంత్రపుష్పము, తీర్థప్రసాద వినియోగము
- ఉదయం 9.30 గంటలకు : యాగశాలలో శ్రీ విజయదుర్గా, చండీహోమము ప్రారంభం
- ఉదయం 10.00 గంటలకు : శ్రీ చక్రమండపంలో నవావరణ శ్రీ చక్రార్చన
- మధ్యాహ్నం 12.00 గంటలకు : మహానివేదన
- మధ్యాహ్నం 12.00 గంటల నుండి సాయంత్రం 4. 00 గంటల వరకు : సాయంత్రం 4. 00 గంటల వరకు సర్వ దర్శనం
- సాయంత్రం 4. 00 గంటలకు : నిత్యార్చనలు ప్రారంభం
- సాయంత్రం 4. 30 గంటలకు : ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేష పూజ కార్యక్రమము జరుగును
- సాయంత్రం 6. 00 గంటలకు : ఉత్సవ మంటపంలో ఉత్సవమూర్తి సందర్శన ( అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేష పూజ కార్యక్రమము జరుగును)
- రాత్రి 7. 00 గంటలకు : నైవేద్యము , మహా మంగళ హారతి , మంత్రం పుష్పము, తీర్థప్రసాద వినియోగము
- రాత్రి 8. 00 గంటలకు : ఆలయ ప్రదక్షిణ , మండపంలో దర్బార్ సేవ
- రాత్రి 10. 00 గంటలకు : పవళింపు సేవ, కవాట బంధనము, దర్శనము ముగియును .
కడప శ్రీ విజయదుర్గా దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జరిగే కార్యక్రమ విశేషాలు
Thank You