Meeku Telusa

తిరుమల మాడ వీధుల గురించి మీకు తెలుసా?


🌟 ఒకప్పుడు ఆలయం చుట్టూ స్వామి వారు వాహనంలో ఊరేగటానికి గాను సరియైన వీధులుండేవి కావు. అంచేత బ్రహ్మోత్సవాల సమయంలో ధ్వజారోహణ ఇక్కడ చేసినా మిగతా కార్యక్రమాలు, ఊరేగింపులు తిరుచానూరులో జరిపేవారు.

🌟 తమిళంలో ఆలయానికి చుట్టూ అర్చకులు నివసించే ఇళ్ళున్న వీధులను పవిత్రంగా భావించి ‘మాడాం’ అని పిలుస్తారు. అదే మాడవీధులుగా మారింది.

🌟 తిరుమల మాడ వీధుల యొక్క పూర్తి వివరాలు:

🌟 శ్రీరామానుజుల వారు దేవాలయం చుట్టూ వీధుల నేర్పరిచి స్వామివారు ఆ వీధుల్లో ఊరేగేందుకు ఏర్పాట్లు చేశారు. తదనంతరం తి.తి.దే. మాస్టర్ ప్లాన్ లో భాగంగా వీధుల్ని మరింత వెడల్పు చేసి సుందరంగా తీర్చిదిద్దారు.

🌟 తిరుమల ఆలయం చుట్టూ నాలుగు మాడ వీధులున్నాయి. వీటిని నాలుగు వేదాలకు ప్రతీకలుగా భావిస్తారు.

1.తూర్పు మాడ వీధి:

🌟 ఆలయం తూర్పు ముఖంగా ఉంది ఎదురుగా ఉన్నదే తూర్పు మాడవీధి. శ్రీవారి ఆలయం ముందు నుండి పుష్కరిణి వరకుండే వీధిని తూర్పు మాడ వీధి అంటారు. ఒకప్పుడు పుష్కరిణి గట్టు పైన కూడా ఇళ్ళుండేవి.

🌟 ఈ వీధిలోనే శ్రీవారి కొయ్య రథం ఉండేది. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న(ఉండే) వీధిని సన్నిధి వీధి అంటారు.

🌟 ఒకప్పుడు సన్నిధి వీధి, వేయికాళ్ళ మండపం ఉండేవి. సన్నిధి వీధికి ఇరు ప్రక్కలా అంగళ్ళుండేవి. ఈ వీధికి ప్రారంభంలో గొల్ల మండపం, చివరలో బేడి ఆంజనేయస్వామి గుడి ఉండేవి.

🌟 క్రీ.శ. 1464 నాటి శాసనం ప్రకారం ఎర్రకంప దేవకుమారుడు సాళువ మల్లయ్య దేవ మహారాయ వెయ్యి కాళ్ళ మండపం కట్టించారు.

🌟 మాస్టర్ ప్లాన్ లో భాగంగా కళా నైపుణ్యం గల చారిత్రాత్మక కట్టడం వెయ్యి కాళ్ళ మండపం తొలగించబడింది.

2.దక్షిణ మాడ వీధి:

🌟 ఈ వీధిలోనే తిరుమల నంబి గుడి ఉంది. దీని పక్కనే-ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్సు నుండి గుడికి చేరే వంతెన కిందే ఒకప్పుడు గుర్రాల పాక ఉండేదట. కొండ కొచ్చిన రాజుల గుర్రాలను అక్కడ కట్టి వేసేవారట. ఈ వీధి మొదట్లో (ఆగ్నేయంలో) ‘ఊంజల్ మండపం’ ఉంది.

🌟 ఇది వరకు శ్రీవారికి ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ ఈ మండపంలోనే జరిగేవి. ప్రతిరోజూ సాయంత్రం శ్రీనివాసుడు తన ప్రియసఖులతో ఈ మండపం లోనే ఊయల ఊగుతూ భక్తులకు కనువిందు చేసేవాడు.

🌟 దీన్ని ఇటీవల ఆలయం ముందున్న విశాల ప్రాంగణంలోకి మార్చటం జరిగింది. తిరుమల నంబి గుడి తర్వాత ‘ఉగ్రాణం'(ప్రసాదాలు తయారీకి అవసరమైన సరుకులు నిల్వ ఉంచు చోటు )ఉంది.

3.పడమర మాడ వీధి:

🌟 ఆలయానికి వెనక వైపున ఉన్నదే పడమర మాడవీధి. ఒకప్పుడు ఎన్నో మఠాలు, సత్రాలు ఉండేవి. ప్రస్తుతం తిరుమల చిన జీయర్ స్వామి మఠం, (తిరుమల చిన్న జియ్యర్ పెద్ద జీయర్ ఏకాంగి అనే వ్యస్థను 11 వ శతాబ్దం లో రామానుజాచార్య స్వామి వారు ఏర్పాటు చేశారు) కర్ణాటక కళ్యాణ మండపం,వసంత మండపం ఉన్నాయి. అనంతాళ్వారు తోట శ్రీవారి ఆలయానికి పడమర దిక్కులో ఉంది.

4.ఉత్తర మాడ వీధి:

🌟 ప్రస్తుత పుష్కరిణికి పడమటి వైపున పాత పుష్కరిణి ఉండేది. అచ్యుతరాయలు 16వ శతాబ్దంలో మళ్ళీ తవ్వించి ‘అచ్యుతరాయ కోనేరు’ అని పేరు మార్చాడని చెబుతారు. కొందరు ఆ పేరుతో మరో కోనేరు తవ్వించాడంటారు. ఏది ఏమైనా పుష్కరిణిగానే ప్రసిద్ధి గాంచింది.

🌟 ఉత్తర మాడ వీధి లో ఉత్తరాది వారి మఠం, తిరుమల నంబి తోళపు కైంకర్య నిలయం, అహోబిల మరం శ్రీ వైఖానస అర్చక నిలయం ఈ వీధిలోనే ఉన్నాయి. స్వామి పుష్కరిణి ఈ వీధిలోనే ఉంది. శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో వరాహ స్వామి ఆలయం ఉంది. ఈ వీధిలోనే తాళ్ళపాక వారి ఇల్లు ఉండేది. తరిగొండ వెంగమాంబ మొదట్లో ఇదే వీధిలో గల ఇంటిలో నివసించేది. ఆమె సమాధి తరిగొండ బృందావనం – ఇదే వీధిలో అర్చకుల క్వార్టర్స్ వెనకాల గల ఉంది.

🌟 ఒకప్పుడు రాజులు విడిది చేసే అంతఃపురం కూడా ఈ వీధిలోనే ఉండేదని చెబుతారు.

🌟 ఉత్తరమాడ వీధిలోనే పుష్కరిణి ఒడ్డున శ్రీ వ్యాసరాజ అహన్నిక మంటపం, ఆంజనేయస్వామి సన్నిధి, శ్రీ విఖనస మహర్షి సన్నిధి ఉన్నాయి. వాటి కెదురుగా శ్రీ రాధాకృష్ణ దేవాలయం, శ్రీ హయగ్రీవ మందిరం కలవు.

🌟 ఆనంద నిలయం చుట్టూ ఉన్న ఈ నాలుగు మాడ వీధులు లో చేసే ప్రదక్షిణ కి మహా ప్రదక్షిణం అని పేరు.

🌟 తిరుమాడ ప్రదక్షిణ ప్రియ గోవిందా.. మహా ప్రదక్షిణ ప్రియ గోవిందా.. ఆనంద నిలయ వాసా గోవిందా …!గోవిందా…!

About the author

Mallikarjuna

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!