చే అంటే సాహసం. పోరాటం. ప్రవహించే ఉత్తేజం. సామ్రాజ్యవాదు లను గడగడలాడించిన విప్లవ కెరటం. చే పూర్తి పేరు ఎర్నెస్టో గువేరా డి లా సేర్నా. 1928 జూన్‌ 14న లాటిన్‌ అమెరికా లోని అర్జెంటీనా దేశంలో జన్మించారు. ప్రజలను పీడించే అమెరికా లాంటి దేశాలకు సింహస్వప్నమై స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం నిలబడ్డాడు. దక్షిణ అమెరికా ఖండపు విప్లవకారుడు. మార్క్సిస్టు శ్రేయోభిలాషి. రాజకీయ నాయకుడు. వైద్యుడు. రచయిత. మేధావి. గెరిల్లా యోధుడు. 

1951 డిసెంబర్‌ నుంచి 1952 జూలై వరకూ మిత్రుడు ఆల్బర్ట్‌ గ్రనాడోతో కలిసి చిలీ, పెరు, కొలంబియా, వెనిజులా దేశాలలో చేసిన మోటారు సైకిల్‌ యాత్ర చే జీవితంలో పెనుమార్పుకు కారణం అయింది. ‘చే’ ను విప్లవం వైపు ఎంతగానో ఆకర్షించింది. అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చూసి చలించిపోయాడు. ఆర్థిక అసమానతలు, ఏకస్వామ్య పెట్టుబడిదారీ వ్యవస్థ, వలసవాదం, సామ్రాజ్యవాదుల ఫలితంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని నిర్ణయానికి వచ్చాడు. పెట్టుబడిదారీ వ్యవస్థ లోని విషవృక్షాలు ఎంత బలంగా నాటుకున్నాయో తెలుసుకోవడానికి చే కు ఎక్కువ కాలం పట్టలేదు. చివరకు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చెయ్యాలని నిర్ణయానికి వచ్చాడు. 

లాటిన్‌ అమెరికా దేశాలన్నీ ఒక్కటి కావాలని కోరుకున్నాడు. అందుకు సాయుధ పోరాటమే మార్గమని భావించేవాడు. చేగువేరా అందరికీ విప్లవకారుడుగానే తెలుసు. కానీ ఆయన గొప్ప మేధావి కూడా. యుక్త వయస్సు లోనే అనేక అంశాల పట్ల స్పష్టమైన అవగాహన ఉండేది. ముఖ్యంగా మార్క్స్‌, లెనిన్‌, ఏంగిల్స్‌ లాంటి వారి రచనలు చదివేవాడు. 

1953వ సంవత్సరంలో వైద్య పట్టా పొందాడు. మొట్టమొదటి సారిగా గ్వాటెమాల అధ్యక్షుడు జాకబ్‌ అర్భేంజ్‌ ప్రజానుకూల భూసంస్కరణలు చేయటం ద్వారా అమెరికా ఫ్రూట్‌ జ్యూస్‌ కంపెనీలకు నష్టం వాటిల్లిందని, అందుకు కారణమైన జాకబ్‌ అర్భేంజ్‌ను పదవీచ్యుతున్ని చేయాలని అమెరికా కుట్ర చేసింది. గువేరా, ప్రభుత్వానికి అండగా ఉండడంతో అమెరికా సైన్యం గువేరాను చంపాలనుకుంది. అయితే గ్వాటెమాల రాయబారి సహాయంతో తప్పించుకున్నాడు.

అతి తక్కువ కాలంలో క్యూబా విప్లవంలో కీలకంగా మారాడు. అమెరికా సైన్యాలు కూడా చేగువేరా యుద్ధ వ్యుహాలను చూసి ఆశ్చర్యపోయాయి. కాలి నడకన అది కూడా రాత్రిపూట మాత్రమే అనేక వందల కిలోమీటర్లు నడిచేవాళు.్ల ఒకసారి వారం రోజుల పాటు ఆహరం కూడా లేకుండా పోరాటాన్ని నడిపారు. ఒక్కొక్క పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటూ వచ్చారు. 

దాదాపు రెండు సంవత్సరాల కాలంలో గెరిల్లా పోరాటం కీలక పాత్ర పోషించింది. 1958 సంవత్సరంలో ఒక్కొక్క నగరాన్ని స్వాధీనం చేసుకుంటూ చివరకు క్యూబా రాజధాని హవానాలో జనవరి 8న ఫైడెల్‌ క్యాస్ట్రో విజయోత్సవ ర్యాలీతో విప్లవం జయప్రదం అయింది. క్యూబా ప్రభుత్వంలో సైతం కీలక బాధ్యతలు నిర్వహించి ప్రజలకు సేవ చేశాడు. పరిశ్రమల మంత్రిగా, జాతీయ బ్యాంకు అధ్యక్షుడుగా, క్యూబా ప్రతినిధిగా వ్యవహరించాడు. వర్ధమాన దేశాల్లో రైతాంగ పోరాటాలు నిర్వహించాలని తద్వారా విప్లవం సాధించాలని కోరుకున్నాడు. కేవలం క్యూబాను విముక్తి చేస్తే సరిపోదని అనేక దేశాలు అమెరికా సామ్రాజ్యవాద దోపిడీకి గురవుతున్నాయని వారిని విముక్తి చేయాలని భావించి 1965 సంవత్సరంలో క్యాస్ట్రో ఎంత వాదించినా వినకుండా దక్షిణాఫ్రికా లోని కాంగో, ఆ తర్వాత బొలీవియాలో విప్లవం సాధించడం కోసం కృషి చేశాడు. 

భార్య, ఇద్దరు పిల్లలకు దూరంగా పీడిత ప్రజల కోసం, వారి విముక్తి కోసం పోరాడాడు. లాటిన్‌ అమెరికా భవిష్యత్తుపై చేగువేరాకు ఉన్న ఆలోచన అమెరికాకు మింగుడు పడలేదు. చేగువేరాను చంపాలని నిర్ణయించారు. 1967 అక్టోబర్‌ 9న ఆ దేశ అధ్యక్షుడు రెయిన్‌ బ్యారియస్‌ టోస్‌ చేగువేరాను చంపాలని ఆదేశించాడు. గదిలో సైనికుడు చే ముందు నిలబడగా, కాల్చమని గద్దించాడు చే. బంధించి ఉన్న విప్లవ పోరు కెరటంలా ఎక్కడ ఎగిసిపడుతుందోనన్న భయంతో విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. అలా బొలీవియాలో ప్రభుత్వ సేనలతో పోరాడుతూ 1967 అక్టోబర్ 9న చే వీరమరణం పొందాడు. చేగువేరా చనిపోయినా అతడు రగిలించిన స్ఫూర్తి జ్వాలలు నుండి నిప్పురవ్వలు ఇంకా ఎగసి పడుతూనే ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!