ప్రశ్న: ఎండాకాలంలో వడదెబ్బ ఎందుకు వస్తుంది? వడదెబ్బ నుంచి ఎలా కాపాడుకోగలం?

జవాబు : శరీరంలో నిర్దిష్ట ఉష్ణోగ్రతలోనే జీవ రసాయనిక చర్యలు సజావుగా సాగు తాయి. జీవ రసాయనిక చర్యల వేగాన్ని బట్టి జీవి ఆరోగ్య స్థితిని నిర్ణయించ బడుతుంది. ఆ వేగం తగ్గినా, విపరీతంగా పెరిగినా ప్రమాదం వస్తుంది. వివిధ జీవజాతుల దేహ నిర్మాణం వివిధ మోతాదుల్లో వుంటుంది. మానవుడి దేహ సగటు ఉష్ణోగ్రత సుమారు 37°Cలేదా 98.4°C వుండాలి. సాధారణంగా ఇంతకన్నా ఎక్కువ ఉష్ణోగ్రత పరిసరాల్లో ఉంటే ఉక్కపోస్తోంది అంటాం. పరిసరాల ఉష్ణోగ్రత యింతకన్నా తక్కువ ఉంటే చలి వేస్తోంది అంటాం. వేసవి కాలంలో దేహ ఉష్ణోగ్రత కన్నా చాలా ఎక్కువగా బయటి ఉష్ణోగ్రత వుంటుంది. ప్ర

కృతి నియమాల్లో భాగమైన ఉష్ణ గతిక శాస్త్ర శూన్య నియమం ప్రకారం ఉష్ణశక్తి ఎల్లపుడూ అధిక ఉష్ణోగ్రత ప్రాంతం నుంచి అల్ప ఉష్ణోగ్రత ప్రాంతానికి వెళుతుంది. అంటే వేసవికాలంలో బయటి ఉష్ణోగ్రత ఎక్కువగా వుండడం వల్ల బయటి నుంచి ఉష్ణం శరీరంలోకి వెళ్లే అవకాశం వుంది. దరిమిలా దేహ ఉష్ణోగ్రత పెరిగే ప్రమాదం వుంది. అదేవిధంగా చలికాలంలో పరిసరాల ఉష్ణోగ్రత ప్రాంతాన్ని బట్టి -10°C నుంచి 15°C వరకు ఉండే అవకాశం వుంది. అంటే ఉష్ణ గతికశాస్త్ర శూన్య నియమం ప్రకారం శరీరం నుంచి పెద్ద మోతాదులో ఉష్ణశక్తి బయటికి వెళ్లే ప్రమాదం ఉంది. దీంతో దేహ ఉష్ణోగ్రత 37°C కన్నా తక్కువ అయ్యే ఉపద్రవం వుంది.

జీవ పరిణామ వాదం ప్రకారం ప్రకృతి వల్ల కలిగే పెను ముప్పుల నుంచి కాపాడుకోగల జీవ ధర్మాలు, నిర్మాణం ఉండే జాతులే ఎదిగాయి, పరిణమించాయి. కాబట్టి బయటి ఉష్ణోగ్రత దేహ ఉష్ణోగ్రతకన్నా ఎక్కువగా ఉన్నా లేదా తక్కువగా వున్నా శరీర దేహౌష్ణగ్రతను నియంత్రించే యంత్రాంగం  జీవించి వున్న జీవుల్లో వుంది. మానవుడి మెదడులో వున్న హైపోథలామస్‌ ఈ కార్యకలాపాన్ని నిర్వర్తిస్తుంది. చలికాలంలో శరీరం నుంచి వేడి పోళ్లిపోయి శరీరపు ఉష్ణోగ్రత తగ్గే ప్రమాదం వుంది. కాబట్టి ఆకలి ఎక్కువయ్యేలా చేస్తుంది. తర్వాత ఎక్కువ మోతాదులో పోషక పదార్థాలు ఖర్చయి ఎప్పటికప్పుడు వేడి జనిస్తుంది. అలాగే శరీరపు చర్మం పైపొరల్ని పొడిగా ఉంచేలా రక్త నాళాల్ని కుంచింపజేస్తుంది. దానికి తోడుగా మనం స్వెట్టర్లు, దుప్పట్లు, మఫ్లర్లు కప్పుకొని ఉష్ణ నష్టాన్ని తగ్గించుకొంటుంటాము.

 అలాగే వేసవి కాలంలో శరీరం లోకి వేడి చేరే ప్రమాదం వుంది కాబట్టి ఆ వేడి శరీరంలో నిల్వ వుండ కుండా దాన్ని ఖర్చు చేసేలా చెమట పోసే యంత్రాంగం ఉంది. దానికి తోడుగా మనం పలుచని దుస్తులు ధరిస్తాము. ఫ్యాన్లు, ఎసీలు వేసుకొని సేదదీరుస్తాము. అయితే ఇలాంటి అవకాశాలు, సదుపాయాలు అవగాహన లేని పేదలు, రైతులు, శ్రామికులు ఎండనక, నీడనక కష్టించి పని చేయడం వల్ల అధిక మోతాదులో చెమట ద్వారా నీటిని లవణాల్ని పోగొట్టుకొంటారు. తాగడా నికి సరియైన మోతాదులో నీరు లేకున్నా విపరీతమైన మోతాదులో వేసవి ఎండకు లోనైనా హైపోథలా మస్‌ చేయగల నియంత్రణకు మించి ఉష్ణశక్తి శరీరంలోకి వెళుతుంది. 

అపుడు వడదెబ్బ తగిలింది అంటాము.  వడదెబ్బ తగిలిన వ్యక్తి శరీరం పొడిగా వుంటుంది. కళ్లు బైర్లు కమ్ముతాయి. మాట తడబడు తుంది. నోరు ఎండిపోయి ఉంటుంది. శరీరం చాలా వేడిగా వుంటుంది. వడదెబ్బ చాలా ప్రమాదకర స్థితి. వడదెబ్బ సోకిన వ్యక్తిని వెనువెంటనే చల్లని ప్రాంతంలోకి మార్చి మంచు గడ్డలతో చల్లబర్చాలి. ఎక్కువ మోతాదులో లవణాలు కలిపిన నీటిని తాగించాలి. చల్లగాలి తాకేలా సేదదీర్చాలి. నోటిద్వారా గానీ, సిరింజి ద్వారా గానీ సెలైన్‌ బాటిళ్లు ఎక్కించాలి. మజ్జిగ, పళ్లరసాలు అందించాలి. మద్య పానం పూర్తిగా నివారించాలి. త్వరగా జీర్ణమయ్యేలా ద్రవ ఆహారాన్ని ఇవ్వాలి. వైద్యుణ్ణి సంప్రదించి తగు చికిత్స చేయించాలి. జ్వరానికి, వడదెబ్బకు చాలా తేడా ఉంది. జ్వరంలో ఉన్న వ్యక్తికి చలి వేస్తుంటుంది. ఎప్పటిలాగే చెమట వస్తుంది. కానీ వడదెబ్బ తగిలిన వ్యక్తి శరీరం నుంచి చెమట రాదు. పైగా పొడిగా ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!