ప్రఖ్యాత రచయిత, దౌత్యవేత్త, రాజనీతిజ్ఞుడు, శాస్త్రవేత్త, ఆవిష్కర్త, తత్వవేత్త, పాత్రికేయుడు, ప్రచురణకర్త, అమెరికా సంయుక్త రాష్ట్రాల వ్యవస్థాపకుల్లో ఒకరు.. ఇలా ఫ్రాంక్లిన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అమెరికా చరిత్ర మొత్తం తిరగేసినా ఇంతటి బహుముఖ ప్రతిభావంతుడు మరొకరు కానరారు. 

18వ శతాబ్దంలోనే ‘పూర్ రిచర్డ్స్ అల్మానాక్ పేరుతో మన పంచాంగాల్లాంటి సకల సమాచార గ్రంథాలను ప్రచురించారీయన. మరి ఒక్క మనిషి ఇన్ని రంగాల్లో ఇంతటి ప్రతిభ కనబరచటం ఎలా సాధ్యమైందంటే.. కచ్చితంగా క్రమం తప్పని దినచర్య వల్లే! రోజును క్రమ పద్ధతిలో గడపటం చాలా ముఖ్యమని గుర్తించిన ఫ్రాంక్లిన్ దీనికోసం చాలా రకాలుగా ప్రయోగాలు చేసీచేసీ, చివరికి ప్రత్యేకంగా ఒక ఛార్టు వేసుకున్నారు. ఆయన ఆత్మకథలో కూడా ముద్రించిన ఈ పట్టిక చాలా ప్రాచుర్యం పొందింది. ఉదయం 5కు లేచి ముందు కాలకృత్యాలు, మౌనంగా ‘పవర్ ఫుల్ గుడ్ నెస్’ను తల్చుకోవటం (ధ్యానంలా), ఆ రోజు కచ్చితంగా చెయ్యాల్సిన పనులను నిర్ణయించుకోవటం, అల్పాహారం.. అన్నీ 8లోపు పూర్తవ్వాలి.


ఉదయం 8-12 మధ్య కచ్చితంగా పని. 12-2 మధ్య చదవటం, పద్దులు చూసుకోవటం, భోజనం పూర్తి. మళ్లీ మధ్యాహ్నం 2 – 6 మధ్య పని. సాయంత్రం 6-10 మధ్య ఈ రోజు నేనేం మంచి పని చేశాను? అన్న సమీక్ష, సంగీతం వినటం, ఇతరులతో మాటామంతీ. రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 5 వరకూ నిద్ర. ఎంత ఒత్తిడిలోనైనా ఈ రొటీన్ తప్పేది లేదు. విద్యుత్తు ప్రయోగాలు కావొచ్చు, దేశాలతో శాంతి చర్చలు కావొచ్చు… ఏ పనైనా ఆ నిర్దేశిత 8 గంటల్లోనే! ఉరుకులు పరుగుల్లేవు. ఆస్వాదించని ఘడియా లేదు. సన్నిహితులతో గడపటం, సంగీతం వినటం , వంటివాటికి తక్కువ ప్రాధాన్యమేం లేదు. ఈ రోజు నేనేం మంచి పని చెయ్యాలి? అన్న ప్రశ్నతో మొదలై.. చేసిన మంచేమిటన్న సానుకూల సమీక్షతో రోజు పూర్తవటం విశేషం. మరి ఇవాళ ఆయన చిత్రం డాలర్ నోట్ల మీదా దర్శనమిస్తోందంటే ఆశ్చర్యమేముంది?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!